Viral News: ‘వివాహ దేవుడు’ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న యువకుడు

Japan Man Ryuta Watanabe wants to become the God of Marriage
  • నలుగురు భార్యలు, ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌తో ‘హౌస్ హస్బెండ్’గా మారిన వతనాబే అనే యువకుడు
  • ఆరేళ్లక్రితం గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన జపాన్ వ్యక్తి 
  • అప్పటి నుంచి డేటింగ్ యాప్‌లలో మహిళలతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నాలు
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎవరైనా లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. కానీ జపాన్‌కు చెందిన ఓ యువకుడు మాత్రం వినూత్నంగా దేవుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా ‘వివాహ దేవుడు’గా మారాలని తనకు తాను నిర్దేశించుకున్నాడు. జపాన్‌కు చెందిన 36 ఏళ్ల ర్యూతా వతనాబే అనే యువకుడే కెరీర్‌లో ఈ వినూత్న లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇందుకోసం గత పదేళ్లుగా అతడు ఏ ఉద్యోగమూ చేయడం లేదు. వీలైనంత మందిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు అతడికి నలుగురు భార్యలు, ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. తన ఖర్చుల కోసం కావాల్సిన డబ్బు కోసం అతడు కేవలం భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌పై మాత్రమే ఆధారపడుతున్నాడు. వారి సంపాదనపైనే తనకు నచ్చిన జీవితాన్ని గడుపుతున్నాడు.

ఇక మొత్తం 54 మంది పిల్లలకు తండ్రిని కావాలని వతనాబే కోరుకుంటున్నాడు. అసాధారణ రీతిలో పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేయాలని అతడు కలలు కంటున్నట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం పేర్కొంది. భార్యలు అందరూ వతనాబేను ఉమ్మడి భాగస్వామిగా భావిస్తున్నారని తెలిపింది. పెళ్లికి సంబంధించి ఎలాంటి లాంఛనప్రాయ నమోదు లేకుండానే కలిసి ఉంటున్నారని పేర్కొంది. 

కాగా వతనాబేకు ఇప్పటికే 10 మంది పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు భార్యలతో కలిసి నివసిస్తున్నాడు. హౌస్‌వైఫ్ మాదిరిగా ‘హౌస్ హస్బెండ్’ పాత్రను పోషిస్తున్నాడు. ఇంట్లో వంట చేయడం, ఇంటి పనులు చక్కబెట్టడం, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులు చేస్తున్నాడు.

ఇంటి ఖర్చులు నెలకు సుమారు 914,000 యెన్లు ( దాదాపు రూ.5 లక్షలు) అవుతుండగా వతనాబే భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్ సమానంగా భరిస్తున్నారు. కాగా వతనాబేకి నాలుగవ భార్య కూడా ఉండేది. కానీ అనూహ్యంగా విడిపోయారు. 

ఆరేళ్ల క్రితం వతనాబేకు అతడి గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పింది. దీంతో అతడు డిప్రెషన్‌కు గురయ్యాడు. ఈ కారణమే డేటింగ్ యాప్‌లలో మహిళలతో కనెక్ట్ కావడానికి ప్రేరేపించిందని వతనాబే వివరించాడు. ఓ టీవీ షోలో వతనాబే మాట్లాడుతూ.. ‘‘నేను మహిళల్ని ఇష్టపడతాను. మేము ఒకర్ని మరొకరం సమానంగా ప్రేమిస్తున్నంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవు’’ అని అభిప్రాయపడ్డాడు.
Viral News
Viral Videos
Off beat News
Japan

More Telugu News