Team India: దీటుగా స్పందించిన టీమిండియా... ఆసక్తికరంగా బెంగళూరు టెస్టు

Team India ended day on positive note in Bengaluru test
  • తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 402 ఆలౌట్
  • ముగిసిన మూడో రోజు ఆట
  • రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 231 పరుగులు చేసిన టీమిండియా
  • రాణించిన టీమిండియా టాపార్డర్
  • కోహ్లీ, సర్ఫరాజ్, రోహిత్ శర్మ అర్ధసెంచరీలు
బెంగళూరు టెస్టు ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌటైన టీమిండియా... రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ అర్ధసెంచరీలతో టీమిండియాను ట్రాక్ లో నిలబెట్టారు. 

భారత్ ను తొలి ఇన్నింగ్స్ లో దెబ్బతీసిన కివీస్ పేసర్లు... రెండో ఇన్నింగ్స్ లో ఏమంత ప్రభావం చూపలేకపోయారు. ఇవాళ ఆటకు మూడో రోజు కాగా... న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 402 పరుగులకు ఆలౌటైంది. తద్వారా 356 పరుగుల భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. అనంతరం, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా... నేడు ఆట చివరికి 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. 

ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 35, రోహిత్ శర్మ 52 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 72 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఇక, తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఈసారి తన వికెట్ ను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆడాడు. 102 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 70 పరుగులు చేసిన కోహ్లీ మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ క్రమంలో కోహ్లీ టెస్టుల్లో 9000 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

మరో ఎండ్ లో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ధాటిగా ఆడుతూ క్రీజులో ఉన్నాడు. సర్ఫరాజ్ 78 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులతో ఆడుతున్నాడు. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 2, పార్ట్ టైమ్ బౌలర్ గ్లెన్ ఫిలిప్స్ 1 వికెట్ తీశారు. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఆటకు రేపు నాలుగో రోజు. 

Team India
New Zealand
Day 3
Bengaluru Test

More Telugu News