Liquor shops: ఏపీలో ఇక రూ.99ల క్వార్టర్ బాటిల్ కూడా లభ్యం

ap excise commissioner nishanth kumar says about rs 99 Liquor bottle
  • ప్రైవేటు మద్యం షాపుల్లో అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల బ్రాండ్ల మద్యం  
  • సోమవారం నాటికి రూ.99ల క్వార్టర్ మద్యం సీసాలు 20వేల కేసులకు చేరుకోనుందని చెప్పిన ఎక్సైజ్ శాఖ  ఉన్నతాధికారి 
  • ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్దం అవుతున్నట్లు వెల్లడి
ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన విధంగా చౌక ధర మద్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో మందు బాబులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రైవేటు మద్యం షాపుల్లో వివిధ రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన రూ.99ల క్వార్టర్ బాటిళ్ల మద్యం అందుబాటులో లేకపోవడంతో షాపుల నిర్వాహకులతో మందుబాబులు గొడవ పడుతున్నారు. తక్కువ ధర మద్యం ఎప్పుడు వస్తుందంటూ నిలదీస్తున్నారు. 

దీంతో రాష్ట్ర ఎక్సైజ్ అధికారి మందు బాబులకు గుడ్ న్యూస్ అందిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిశాంత్ కుమార్ తెలిపారు. మద్యం తయారీ విక్రయాలలో జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన ఐదు సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధరకు మద్యం విక్రయాలు చేసేందుకు సిద్దం అయ్యాయని తెలిపారు. గురువారం నాటికి పది వేల కేసుల రూ.99 మద్యం మార్కెట్ కు చేరిందని, సోమవారం నాటికి రోజువారీ సరఫరా 20వేల కేసులకు చేరుతుందని ఆయన వివరించారు. 

దశల వారీగా సరఫరా పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ క్రమంలో మొత్తంగా కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మధ్యం ఈ నెలలో అందుబాటులోకి రానుందని తెలిపారు. వినియోగాన్ని అనుసరించి తదుపరి నెలలలో ఏ మేరకు దిగుమతి చేసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని నిశాంత్ కుమార్ వివరించారు. 
Liquor shops
Andhra Pradesh
nishanth kumar
rs 99 Liquor bottle

More Telugu News