Actor Bala: మాజీ భార్య ఫిర్యాదు.. మలయాళ నటుడు బాలా అరెస్ట్

Actor Bala arrested on complaint filed by former wife Amritha Suressh
  • సోషల్ మీడియాలో తమ పరువు తీస్తున్నాడని అమృతా సురేశ్ ఫిర్యాదు
  • ఎడవల్లిలోని ఆయన ఫ్లాట్ నుంచి ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కుమార్తె ఆరోపణలను కూడా ఖండించిన బాలా
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు బాలాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా తనతోపాటు తన కుమార్తె పరువు తీస్తున్నాడన్న ఆయన మాజీ భార్య అమృతా సురేశ్ ఫిర్యాదు మేరకు కొచ్చిలోని కడవంట్ర పోలీసులు బాలాను అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ (చిన్నారుల రక్షణ) చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఎడపల్లిలోని బాలా ఫ్లాట్‌లో ఈ తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అక్కడాయనను ప్రశ్నిస్తున్న పోలీసులు ఈ సాయంత్రం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, బాలా తమను వేధిస్తున్నాడని గతంలోనూ ఆయన కుమార్తె ఆరోపించారు. ఈ కేసు ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉండడంతో అక్కడికి బదిలీ చేసే అవకాశం ఉంది.  

కుమార్తె ఆరోపణలపై స్పందించిన బాలా ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు హాని చేయాలని చిన్నప్పటి నుంచి తన తండ్రి ప్రయత్నిస్తున్నాడన్న ఆమె ఆరోపణలను కొట్టిపడేసిన బాలా.. తనను ఇప్పటికైనా తండ్రిగా గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇది తన జీవితంలోనే అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొన్నాడు. అయితే, ఈ ఆరోపణలతో అంగీకరించేది లేదని, అలాగని తనతో వాదించే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశాడు. కుమార్తెతో వాదించే తండ్రి అసలు మనిషే కాదని చెప్పుకొచ్చాడు.
Actor Bala
Malayalam
Amritha Suressh
Crime News

More Telugu News