Mahela Jayawardene: ముంబ‌యి ఇండియ‌న్స్ హెడ్ కోచ్‌గా మ‌హేల‌ జ‌య‌వ‌ర్ధ‌నే

Mahela Jayawardene back as Mumbai Indians Head Coach Replaces Mark Boucher
  • మార్క్ బౌచర్ స్థానంలో మ‌హేల‌ జ‌య‌వ‌ర్ధ‌నేకు బాధ్య‌త‌లు
  • గతంలో 2017 నుంచి 2022 వరకు ముంబ‌యికి ప్రధాన కోచ్‌గా ప‌నిచేసిన మ‌హేల‌
  • అత‌ని హ‌యాంలో ముంబయికి 3 ఐపీఎల్‌ టైటిళ్లు
ముంబ‌యి ఇండియన్స్ ఐపీఎల్‌ 2025కి ముందు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేని తమ హెడ్‌ కోచ్‌గా తిరిగి నియమించింది. ఐపీఎల్‌ 2024లో ఫ్రాంచైజీ చివరి స్థానంలో నిలిచిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ సీజ‌న్‌లో కోచ్‌గా ఉన్న‌ ద‌క్షిణాఫ్రికా మాజీ క్రికెట‌ర్‌ మార్క్ బౌచర్‌ను తొల‌గించి జయవర్ధనేకు ఆ బాధ్యతలు అప్ప‌గించింది. కాగా, జయవర్ధనే గతంలో 2017 నుంచి 2022 వరకు ముంబ‌యి ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. అత‌ని హ‌యాంలో ముంబయి 3 టైటిళ్లు సాధించింది. 

"ముంబ‌యి ఇండియ‌న్స్‌తో నా ప్రయాణం ఎప్పుడూ గొప్ప‌గానే సాగింది. 2017లో అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు ప్రతిభావంతులైన కుర్రాళ్ల‌ను వెలికితీసి ఒకచోట చేర్చ‌డంపై దృష్టి కేంద్రీకరించాం. అందులో విజ‌య‌వంతం అయ్యాం. ఇప్పుడు తిరిగి హెడ్ కోచ్‌గా నియామ‌కం అయ్యాను. ముంబైను మరింత బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తాను. ముంబ‌యి గ‌త చ‌రిత్ర‌ల‌ను కొన‌సాగిస్తాం. కొత్త స‌వాల్‌ను స్వీక‌రించ‌డానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను" అని జయవర్ధనే ఒక ప్రకటనలో తెలిపాడు. 

ఇక ముంబ‌యి ఇండియ‌న్స్‌ ప్రధాన కోచ్‌గా వైదొలిగిన త‌ర్వాత‌ జయవర్ధనే 2022లో ఫ్రాంచైజీ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్‌గా కీల‌క బాధ్య‌త‌లు చేపట్టాడు. త‌ద్వారా ఇప్పుడు ముంబ‌యి ఫ్రాంచైజీ యజమానులు కలిగి ఉన్న నాలుగు జట్లలో కోచింగ్, స్కౌటింగ్‌ను పర్యవేక్షిస్తున్నాడు. వీటిలో ముంబై ఇండియన్స్‌తో పాటు యూఏఈ ఐఎల్‌టీ20లో ఎంఐ ఎమిరేట్స్, ఎస్ఏ20లో ఎంఐ కేప్టౌన్, యూఎస్ఏ ఎంఎల్‌సీలో ఎంఐ న్యూయార్క్ ఉన్నాయి.

"ముంబై ఇండియన్స్‌కు మహేల తిరిగి ప్రధాన కోచ్‌గా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా గ్లోబల్ టీమ్‌లు ఆయ‌న‌ పర్యవేక్ష‌ణ‌లో చాలా బాగా రాణించాయి. అతని నాయకత్వం, జ్ఞానం, ఆట పట్ల మక్కువ ఎల్లప్పుడూ ఎంఐకి ప్రయోజనం చేకూర్చాయి" అని ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్‌ అంబానీ అన్నారు. 

ఐపీఎల్‌లో కోచింగ్‌తో పాటు జయవర్ధనే.. హండ్రెడ్ (సదరన్ బ్రేవ్), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఖుల్నా టైటాన్స్) జట్లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. శ్రీలంక జట్టుతో కలిసి జయవర్ధనే ఇటీవల కన్సల్టెంట్ కోచ్‌గా కూడా వివిధ హోదాల్లో పనిచేశాడు.
Mahela Jayawardene
Mumbai Indians
Head Coach

More Telugu News