Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు

Presidents rule has been revoked in Jammu and Kashmir by Ministry of Home Affairs
  • ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ కేంద్రం నిర్ణయం
  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ
  • జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే కొలువుదీరనున్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం
ఇటీవలే ఎన్నికలు జరుపుకున్న కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం పొద్దుపోయాక అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు అయిందని, తద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని గెజిట్ నోటిఫికేషన్‌లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. అక్టోబర్ 31, 2019న జారీ చేసిన మునుపటి ఆర్డర్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది. తాజా ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని వివరించింది. ఈ మేరకు విడుదల చేసిన గెజిట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు.

జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019లోని సెక్షన్ 54 ప్రకారం ముఖ్యమంత్రి నియామకానికి ముందు అక్టోబర్ 31, 2019 నాటి రాష్ట్ర పాలనకు సంబంధించిన ఉత్తర్వులను రద్దు చేశామని గెజిట్ ఉత్వర్వులో ప్రభుత్వం పేర్కొంది. కాగా ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగిన విషయం తెలిసిందే.
Jammu And Kashmir
Droupadi Murmu
Central Government

More Telugu News