Delhi CM: ఢిల్లీ కొత్త సీఎం అతిశీకి అధికారిక నివాసం కేటాయింపు

delhi cm atishi officially allotted civil lines bungalow after row over residence
  • ఎట్టకేలకు సీఎం అతిశీకి బంగ్లా కేటాయింపు
  • కేజ్రీవాల్ ఖాళీ చేసిన భవనాన్నే కేటాయించిన పీడబ్ల్యూడీ అధికారులు
  • అధికారికంగా నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతిశీకి పీడబ్ల్యూడీ అధికారులు ఎట్టకేలకు అధికారిక నివాసాన్ని కేటాయించారు. 6, ప్లాగ్ స్టాఫ్ రోడ్డులోని సివిల్ లైన్స్ నివాసాన్ని ఆమెకు కేటాయించినట్లు పీడబ్ల్యూడీ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వెలువడిన ఎనిమిది రోజుల్లోగా బంగ్లాకు సంబంధించిన అంగీకారపత్రాన్ని సీఎం సమర్పించాలని లేఖలో పీడబ్ల్యూడీ పేర్కొంది. 

ఇటీవల ఢిల్లీ సీఎం అధికార నివాసంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకి సోమవారం అతిశీ ఫిఫ్ట్ అయిన నేపథ్యంలో అధికారిక పత్రాలు రాలేదంటూ ఆమె వస్తువులను అధికారులు తీసుకువెళ్లిపోయారు. దీంతో ఈ అంశంపై గవర్నర్ వర్సెస్ ఆప్ మధ్య దుమారం రేగింది. కేంద్రం అండతో గవర్నర్ వీకే సక్సేనా ముఖ్యమంత్రి వస్తువులను తరలించారని సీఎంఓ ఆరోపించింది. అయితే వివాదం మరింత ముదరకముందే సమస్యను పరిష్కరించారు. సీఎంకు అధికారికంగా నివాసాన్ని కేటాయించడంతో ఈ వివాదానికి తెరపడింది. 
 
కేజ్రీవాల్ గత నెలలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆప్ ఎల్పీ నేతగా అతిశీని ఎంపిక చేశారు. దీంతో సెప్టెంబర్ 21న ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే హర్యానా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్ వెంటనే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. ఈ నెల 4వ తేదీన కేజ్రీవాల్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి పార్టీ నేతలకు చెందిన భవనంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఖాళీ చేసిన నివాసంలోకి అతిశీ తన నివాస వస్తువులు తరలించారు. ఆ క్రమంలో అధికారిక పత్రాలు రాలేదంటూ పీడబ్ల్యూడీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సామానును తరలించడం వివాదాస్పదం అయింది.
Delhi CM
Atishi
cm residence Bungalow
national news

More Telugu News