Nara Bhuvaneswari: విజయవాడలో 'నారీ శక్తి విజయోత్సవం' కార్యక్రమానికి హాజరైన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari attends Nari Shakti Vijayotsav in Vijayawada
  • పున్నమి ఘాట్ వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • ప్రపంచంలో అనేక రంగాల్లో మహిళా శక్తి దూసుకెళుతోందన్న నారా భువనేశ్వరి
  • మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరని వెల్లడి
ఏపీ ప్రభుత్వం ఇవాళ విజయవాడలో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది.  పున్నమి ఘాట్ లో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి హాజరయ్యారు. మహిళా మంత్రులు, ఆలిండియా సర్వీస్ అధికారుల అర్ధాంగులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రసంగిస్తూ... ప్రపంచంలో అనేక రంగాల్లో మహిళా శక్తి దూసుకువెళుతోందని అన్నారు. స్త్రీని ఎలా గౌరవించుకోవాలి అని భావితరాలకు నేర్పించే వేదికగా ఈ శక్తి విజయోత్సవ కార్యక్రమం నిలుస్తుందని పేర్కొన్నారు. 

సమాజంలో మహిళలకు ఎన్నో అవాంతరాలు, కష్టాలు ఎదురవుతుంటాయని, వాటన్నింటినీ అధిగమిస్తేనే మహిళలు విజయవంతం అవుతారని తెలిపారు. అయితే, మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ప్రతి మహిళ ఒక శక్తిగా ఉంటూ తన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుందని అన్నారు. 

ఒక అమ్మగా, అర్ధాంగిగా, అత్తగా, చెల్లిగా, అక్కగా... ఇలా వేర్వేరు రూపాల్లో మహిళలు బాధ్యతలు నెరవేరుస్తుంటారని వివరించారు. కుటుంబం కోసం పాటుపడే ప్రతి మహిళ తనకు స్ఫూర్తి అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. 

ప్రతి మహిళ తనపై తాను నమ్మకం పెంచుకోవాలని, పట్టుదలతో ముందుకు వెళ్లాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ప్రతి మహిళలో దుర్గా శక్తి ఉంటుందని, ఆ శక్తిని గుర్తించాలని, ఆ శక్తే విజయాన్ని అందిస్తుందని తెలిపారు. 

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి చేనేత వస్త్రాల విశిష్టత గురించి మాట్లాడారు. చేనేత వస్త్రాలు, హస్తకళలు మనకున్న గొప్ప సంపద అని అభివర్ణించారు. 

మనందరం చేనేత కార్మికులకు అండగా నిలవాలని, అందుకే చేనేత వస్త్రాలు ధరించి ఈ దసరా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చానని వెల్లడించారు. వారానికి కనీసం ఒక్క రోజు అయినా చేనేత వస్త్రాలు ధరించాలని నారా భువనేశ్వరి సూచించారు.
Nara Bhuvaneswari
Nari Shakti Vijayotsav
Vijayawada
TDP-JanaSena-BJP Alliance

More Telugu News