Air India: రెండు గంటలు గాల్లో చక్కర్లు కొట్టి... తిరుచ్చిలో ఎయిరిండియా విమానం ల్యాండింగ్!

Air India Express flight makes emergency landing in Trichy after mid air snag
  • తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన విమానం
  • హైడ్రాలిక్ వ్యవస్థ పని చేయడం లేదని గుర్తించిన పైలట్లు
  • ఇంధనం నిర్దేశిత స్థాయికి తగ్గాక ఎమర్జెన్సీ ల్యాండ్ చేసిన పైలట్
తమిళనాడులోని తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం గాలిలో ఉండగానే పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. హైడ్రాలిక్ వ్యవస్థ పని చేయడం లేదని గుర్తించిన పైలట్లు తిరుచ్చి విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో విమానాశ్రయ అధికారులు అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. పైలట్ విమానాన్ని సురక్షితంగా కిందికి దించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఎయిరిండియా ఏఎక్స్‌బీ 613 విమానం ఈరోజు సాయంత్రం తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరింది. ఈ విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాలంటే నిర్దేశితస్థాయి వరకు ఇంధనం తగ్గాల్సి ఉంటుంది. ఇందుకోసం, పైలట్లు రెండు గంటల పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు.

ఇంధనం నిర్దేశితస్థాయికి చేరుకున్న తర్వాత విమానాన్ని తిరుచ్చిలో ల్యాండింగ్ చేశారు. గంటలపాటు అక్కడే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అలాగే ప్రయాణికుల భద్రతపై అధికారులు ఆందోళన చెందారు. ముందస్తు చర్యగా 20 అంబులెన్సులు, 20 అగ్నిమాపక వాహనాలు, పారామెడికల్ సిబ్బందిని విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచారు.
Air India
Aeroplane
Kerala

More Telugu News