Kolusu Parthasarathy: సాక్షి పత్రికకు నిధులు ఇవ్వడంపై విచారణ జరుపుతున్నాం: ఏపీ మంత్రి పార్థసారథి

Investigation going on funds to Sakshi says Parthasarathy
  • ఒకే రోజు 60 లక్షలకు పైగా పింఛన్లను పంపిణీ చేయించిన ఘనత చంద్రబాబుదన్న పార్థసారథి
  • మేనిఫెస్టో పేరుతో గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోపిడీ చేసిందని విమర్శ
  • కూటమి పాలనలో రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారని వ్యాఖ్య
ఒక్క రోజులోనే ప్రభుత్వ ఉద్యోగుల చేత 60 లక్షలకు పైగా పింఛన్లను పంపిణీ చేయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని ఏపీ గృహ నిర్మాణ, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పార్థసారథి కొనియాడారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఈరోజు ఆయన తన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేస్తున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నింటి పైనా పార్టీ రంగులు, బొమ్మలు వేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కాపాడుతోందని చెప్పారు. 

మేనిఫెస్టో పేరుతో గత ప్రభుత్వం దోపిడీ చేసిందని... ఐదేళ్ల పాలనలో రూ. 10.50 లక్షల కోట్ల అప్పు చేసిందని పార్థసారథి తెలిపారు. అవినీతిని వ్యవస్థీకృతం చేశారని దుయ్యబట్టారు. లబ్ధిదారులకు ఇచ్చే గృహ నిర్మాణ వ్యయాన్ని రూ. 2.50 లక్షల నుంచి రూ. 1.80 లక్షలకు తగ్గించింది కూడా గత ప్రభుత్వమేనని విమర్శించారు. 

సాక్షి పత్రికకు గత ప్రభుత్వం నిధులు ఇవ్వడంపైనా... ప్రభుత్వ ప్రకటనలను సాక్షికి మాత్రమే ఇవ్వడంపైనా విచారణ జరుపుతున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి లక్షల మందికి ఉపాధిని కల్పించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. పెట్టుబడిదారులు ఏపీకి క్యూ కడుతున్నారని చెప్పారు.
Kolusu Parthasarathy
Chandrababu
Telugudesam
YSRCP
Sakshi

More Telugu News