assistant director: టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు

case against assistant director who posted obscene videos on social media
  • సినీ సంస్థకు సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా పేజీలో అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేసిన సృజన్ సాయి
  • నిర్మాత ఉద్యోగం నుంచి తొలగించాడన్న కోపంతో కక్ష 
  • నిర్మాత ఫిర్యాదుతో సృజన్ పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
సంస్థకు సంబంధించిన సోషల్ మీడియా పేజీలో అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ పై బంజారాహిల్స్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని సాగర్ సొసైటీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సినీ నిర్మాత, దర్శకుడు షేక్ నాగుల్ షరీఫ్ వద్ద టి. సృజన్ సాయి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ పేజీ నిర్వహణ బాధ్యతను సృజన్ సాయికి నాగుల్ షరీఫ్ అప్పగించాడు. నటీనటులతో పాటు ఇతర సాంకేతిక నిపుణుల అఫీషియల్ పేజీని ఫాలో అవ్వాలని నిర్మాత నాగుల్ షరీఫ్ అతనికి సూచించాడు. అయితే సృజన్ సాయి ప్రవర్తనపై ఫిర్యాదులు రావడంతో ఉద్యోగం నుంచి షరీఫ్ తొలగించాడు. దీంతో షరీఫ్‌పై కోపం పెంచుకున్న సృజన్ సాయి అక్కడి సిబ్బందిని దుర్భాషలాడాడు. 

అంతే కాకుండా సినిమాకు సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా పేజీ పేరు మార్చాడు. అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు పోస్టు చేయడంతో పాటు వాటిని మహిళా ఫాలోవర్స్‌కు పంపించాడు. ఇది గమనించిన నిర్మాత షేక్ నాగుల్ షరీఫ్ సోమవారం సృజన్ సాయిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిపై బంజారాహిల్స్ పోలీసులు బీఎస్ఎస్ 319 (2), 336(2), 294 తో పాటు 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
assistant director
Social Media
Banjara Hills

More Telugu News