HYDRAA: హైడ్రాపై తప్పుడు ప్రచారం మానుకోవాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Dy CM Bhatti Vikramarka says stop false propaganda on HYDRAA
  • హైదరాబాదులో చెరువుల్లో ఆక్రమణలు
  • హైడ్రా తీసుకువచ్చి ఆక్రమణలు తొలగిస్తున్న కాంగ్రెస్ సర్కారు
  • ప్రజలకు మేలు చేస్తుంటే తప్పుడు ప్రచారాలేంటన్న భట్టి విక్రమార్క
హైదరాబాద్ పరిరక్షణే తమ లక్ష్యమని, హైడ్రాపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలని పాటుపడుతుంటే, అసత్య ప్రచారాలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ అంటేనే కొండలు, గుట్టలు, చెరువులు, పార్కులు అని అభివర్ణించారు. అనేక చెరువులు, పార్కులు కబ్జాలకు గురయ్యాయని భట్టి విక్రమార్క వివరించారు. నగరంలో చిన్న వర్షానికే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. 

మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమేనని, మూసీని మణిహారంలా మార్చాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. మెరుగైన హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ అభిమతమని, ఇందులో ప్రజా అజెండా తప్ప వ్యక్తిగత అజెండా లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

మూసీ బాధితులను తప్పకుండా ఆదుకుంటామని, తొలగించిన ఇళ్లకు బదులు మరో చోట ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదేనని ఉద్ఘాటించారు.
HYDRAA
Mallu Bhatti Vikramarka
Hyderabad
Congress
Telangana

More Telugu News