Israel Travels: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కర్ణాటకలో ప్రైవేటు బస్సు పేరుపై సోషల్ మీడియాలో దుమారం

Owner changes his bus name from Israel Travels to Jerusalem Travels
  • మంగళూరులో ఓ వ్యక్తి తన బస్సుకు ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’ అని పెట్టుకున్న వైనం
  • ఫొటోలు తీసి ఇజ్రాయెల్ పేరు వాడుకుంటున్నాడని నెటిజన్ల ఫైర్
  • పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్
  • వెంటనే స్పందించిన బస్సు యజమాని
  • బస్సు పేరును ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’ నుంచి జెరూసలెం’ ట్రావెల్స్‌గా మార్పు
పేరులో ఏముంది? అంటాడు ‘రోమియో అండ్ జూలియట్’ నవలలో విలియం షేక్‌స్పియర్.  కానీ పేరులోనే అంతా ఉందని ఈ ఘటన నిరూపించింది. కర్ణాటకలోని మంగళూరు బస్సు యజమాని ఒకరు తన బస్సు పేరును ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’ నుంచి ‘జెరూసలెం ట్రావెల్స్’గా మార్చుకోవాల్సి వచ్చింది. దీని వెనక చాలా కథ ఉంది. 

ఇజ్రాయెల్-ఇరాన్ తలపడుతున్న వేళ కొందరు నెటిజన్లు ఈ బస్సు ఫొటోలను షేర్ చేస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మూడ్బిరి-కిన్నిగోలి-ముల్కి రూట్‌లో తిరుగుతున్న ఈ బస్సు ఫొటోలు తీసి షేర్ చేసిన నెటిజన్లు ‘ఇజ్రాయెల్’ పేరును వాడుకుంటున్నందుకు బస్సు యజమానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం కాస్తా యజమాని దృష్టిలో పడడంతో ఈ గోలంతా ఎందుకనుకున్నాడో ఏమో, ఆయనే స్వచ్ఛందంగా తన ట్రావెల్స్ పేరును ఇజ్రాయెల్ నుంచి జెరూసలెంగా మార్చుకున్నాడు.

తాను 12 ఏళ్లుగా ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్నానని బస్సు యజమాని లెస్టర్ కటీల్ పేర్కొన్నారు. ఇటీవలే తన బస్సుకు ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’గా పెట్టుకున్నట్టు తెలిపాడు. అయితే కొందురు దీనిని గమనించి అభ్యంతరం తెలిపారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చూసిన తర్వాత తన బస్సు పేరును మార్చాలని అనుకున్నానని చెప్పాడు. ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’పై ప్రజలకు ఇన్ని అభ్యంతరాలు ఉంటాయని తాను అనుకోలేదని చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందే తన బస్సు పేరును ‘జెరూసలెం ట్రావెల్స్’ గా మార్చినట్టు తెలిపారు.
Israel Travels
Jerusalem Travels
Mangaluru
Karnataka

More Telugu News