Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్

Donald Trump invited billionaire Elon Musk on stage in Pennsylvania
  • ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకుంటే ట్రంప్‌ను గెలిపించాలన్న మస్క్
  • పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎలాన్ మస్క్
  • జులైలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగే చోట ఎన్నికల సభ నిర్వహణ
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024కు సమయం దగ్గర పడుతోంది. నవంబర్‌లోనే పోలింగ్ జరగనుంది. దీంతో ప్రచారం మరింత ఊపందుకుంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష నామినీ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను రంగంలోకి దించారు. జులైలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన ప్రదేశం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఇద్దరూ జంటగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తనపై కాల్పుల జరిగిన మాథ్యూ బ్రూక్స్‌ను ‘దుష్ట రాక్షసుడు’గా ట్రంప్ అభివర్ణించారు. ‘‘సరిగ్గా 12 వారాల క్రితం ఇదే మైదానంలో ఒక హంతకుడు నన్ను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ నన్ను ఎవరూ ఆపలేరు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను వేదికపైకి ట్రంప్ ఆహ్వానించారు. మస్క్ ఒక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. ఇక డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారీస్‌పై విమర్శలు గుప్పించారు.

ట్రంప్‌పై మస్క్ ప్రశంసల జల్లు...
పెన్సిల్వేనియా వేదికగా శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై ఎలాన్ మస్క్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ ఒక అధ్యక్షుడు (జో బిడెన్) మెట్లు ఎక్కలేకపోతున్నారు. మరొకరు తుపాకీతో కాల్చిన తర్వాత కూడా పిడికిలి పైకెత్తారు’’ అని మస్క్ అన్నారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని ట్రంప్ పరిరక్షించాలంటే ఆయన తప్పక గెలవాలని అన్నారు. అమెరికన్ల జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ఎన్నికలు ఇవని అన్నారు. ‘‘మీకు తెలిసిన వారిని తెలియనివారిని అందరినీ ట్రంప్‌కు ఓటు వేయమని కోరండి’’ అని ఎన్నికల సభకు వచ్చినవారిని మస్క్ కోరారు. దాదాపు 7 నిమిషాలపాటు మాట్లాడిన మస్క్.. ‘‘పోరాడండి, పోరాడండి, పోరాడండి, ఓటు వేయండి, ఓటు వేయండి’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

కాగా డొనాల్డ్ ట్రంప్‌పై జులై 13న హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్‌ మ్యాథ్యూ క్రూక్స్‌ అనే యువకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ట్రంప్‌ కుడి చెవి పైభాగం నుంచి దూసుకెళ్లింది. షూటర్‌ని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్చిచంపారు. ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డప్పటికీ ఈ ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.
Donald Trump
Elon Musk
US Presidential Polls
USA

More Telugu News