Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్... రెండ్రోజుల్లో రూ.14 లక్షల కోట్లు నష్టం

Indian investors lose over Rs 14 lakh crore in 2 days
  • మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో నష్టాల్లో మార్కెట్
  • 808 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో వెల్లువెత్తిన అమ్మకాలు
దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ నష్టాల్లో ముగిసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావం భారత మార్కెట్‌పై పడింది. స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజు నష్టపోయింది. 

బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రెండు రోజుల క్రితం రూ.475 లక్షల కోట్లు కాగా, ఈరోజు మార్కెట్ ముగిసిన తర్వాత రూ.461 లక్షల కోట్లకు పడిపోయింది. రెండు ట్రేడింగ్ సెషన్‌లలోనే భారత ఇన్వెస్టర్లు రూ.14 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు.

సెన్సెక్స్ ఈరోజు 808 పాయింట్లు నష్టపోయి 81,688 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 235 పాయింట్లు క్షీణించి 25,014 వద్ద స్థిరపడింది. 

మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ టాప్ లూజర్‌గా నిలిచాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, ఎస్బీఐ టాప్ గెయినర్లుగా నిలిచాయి.

మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 550 పాయింట్లు, నిఫ్టీ స్మాల్ క్యాప్ 193 పాయింట్లు క్షీణించింది. రంగాలవారీగా చూస్తే ఆటో, ఫిన్ సర్వీస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియాల్టీ, ఎనర్జీ, సర్వీసెస్ రంగాలు నష్టాల్లో ముగిశాయి.
Stock Market
Investment
Nifty
Sensex

More Telugu News