Jagan: చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపింది: జగన్

Jagan press meet after Supreme Court verdict on Tirupati laddu row
  • తిరుపతి లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు
  • స్వతంత్ర సిట్ వేయాలన్న అత్యున్నత న్యాయస్థానం
  • టీడీపీ రాజకీయ దుర్బుద్ధిని సుప్రీంకోర్టు అర్థం చేసుకుందన్న జగన్
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో... మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపిందని అన్నారు. 

రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే... దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దు, రాజకీయ డ్రామాలు చేయొద్దు అని స్పష్టమైన వ్యాఖ్యలు చేసిందని వివరించారు. చంద్రబాబు స్వయంగా వేసుకున్న సిట్ ను సైతం రద్దు చేసిందని తెలిపారు. 

లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించడం ద్వారా చంద్రబాబు తిరుమల పవిత్రతను, స్వామివారి విశిష్టతను మంటగలిపాడని, కోర్టులు సైతం చంద్రబాబుకు మొట్టికాయలు వేశాయని విమర్శించారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ చంద్రబాబు పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడాడని, చంద్రబాబు స్వయంగా నియమించుకున్న టీటీడీ ఈవోనే చంద్రబాబు మాటలకు విరుద్ధంగా లడ్డూలపై ప్రకటన చేశాడని జగన్ వెల్లడించారు. 

ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే ఎవరైనా కొద్దో, గొప్పో సిగ్గుపడతారని... దేవుడి విషయంలో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు భయం, భక్తి ఉన్న వ్యక్తి అయితే అతడిలో పశ్చాత్తాపం అనేది రావాలని పేర్కొన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు ముందుకు రావాలని అన్నారు. కానీ చంద్రబాబు ఎలాంటివాడంటే... పశ్చాత్తాపం ఉండదు, దేవుడంటే భయం ఉండదు, భక్తి ఉండదు అని జగన్ వ్యాఖ్యానించారు. 

ఇప్పటికీ టీడీపీ తన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూనే ఉందని మండిపడ్డారు. "నాకు ధర్మారెడ్డి బావ అంట... కరుణాకర్ రెడ్డి మామ అంట... టీడీపీ ట్వీట్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. సుప్రీంకోర్టు చంద్రబాబు మీద అక్షింతలు వేస్తే... జగన్ పాపం పండిందని, జగన్ పై సుప్రీంకోర్టు సీరియస్ అని ట్వీట్ చేశారు. అబద్ధాలు చెప్పడానికి మనుషులు ఏ స్థాయికి దిగజారుతారో అనిపిస్తుంది. 

మనిషన్నాక దేవుడంటే  భయం, భక్తి ఉండాలి... చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించిందన్న విషయాన్ని జాతీయ మీడియా మొత్తం కథనాలు ఇచ్చింది... అందరూ ఈ విధంగా చంద్రబాబును తిడుతున్నా గానీ... టీడీపీ సోషల్ మీడియా దాన్ని కూడా వక్రీకరిస్తోంది" అని జగన్ మండిపడ్డారు.
Jagan
Chandrababu
Supreme Court
Tirupati Laddu Row
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News