Nara Lokesh: కఠిన చర్యలు తీసుకోకపోతే ఒక తరాన్ని నష్టపోతాం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh attends ministers sub committee meeting
  • హోంమంత్రి అనిత అధ్యక్షతన మంత్రుల ఉపసంఘం సమావేశం
  • హాజరైన మంత్రి నారా లోకేశ్
  • డ్రగ్స్ కట్టడిపై చర్చ
సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం ఇవాళ సచివాలయంలో జరిగింది. 

హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ తో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇన్ విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలి: నారా లోకేశ్

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అన్నారు. "మాదక ద్రవ్యాలపై కఠినంగా వ్యవహరించకపోతే ఒక తరాన్ని నష్టపోతాం. గంజాయి దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేపట్టాలి. 

గంజాయి సాగును అరికట్టడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయి విషయంలో ఆయా ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానానికి ఏఐ అనుసంధానించి మెరుగైన ఫలితాలు రాబట్టాలి. విజిబుల్ పోలిసింగ్ తో పాటు ఇన్ విజిబుల్ పోలిసింగ్ పైనా దృష్టి సారించాలి. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలపై అధ్యయనం చేయాలి. 

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు మహిళా పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలి. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అవగాహన కలిగించేలా వీడియోల ప్రదర్శనకు చర్యలు చేపట్టాలి. 

యువగళం పాదయాత్రలో గంజాయి వల్ల ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశాను. మంగళగిరిలోనూ గంజాయి సరఫరాపై మహిళలు పెద్దఎత్తున ఫిర్యాదులు చేశారు. గంజాయి, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలను భాగస్వామ్యం చేస్తాం" అని నారా లోకేశ్ వివరించారు.

ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ విధివిధానాలపై చర్చ

గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఏర్పాటు చేయనున్న ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ విధివిధానాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు 26 జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల కోసం 1908 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుచేయనున్నారు.  
Nara Lokesh
Narcotics
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News