Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ ఏం చెప్పిందంటే...!

Telangana State Commission for Women Talk about Konda Surekha Comments on Samantha
  • రాజకీయవర్గాలతో పాటు సినీ పరిశ్రమలోనూ మంత్రి సురేఖ వ్యాఖ్య‌ల దుమారం 
  • త‌న వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన మంత్రి
  • అయినా ఆగ‌ని సినీ ప్ర‌ముఖుల విమ‌ర్శ‌లు
  • ఈ వ్య‌వ‌హారంపై తాజాగా స్పందించిన తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ 
  • సురేఖ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోయి ఉంటే.. వ్య‌వ‌హారం మ‌రోలా ఉండేద‌ని వ్యాఖ్య‌
నాగచైత‌న్య‌-స‌మంత విడాకుల విష‌య‌మై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ దుమారం రేపుతున్న‌ విష‌యం తెలిసిందే. దీంతో మంత్రి వ్యాఖ్య‌ల‌ను అంద‌రూ ముక్త‌కంఠంతో ఖండించారు. దీనిపై స్పందించిన మంత్రి సురేఖ త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అలాగే మీడియాతోనూ ఈ విష‌యమై మాట్లాడారు.

సమంతకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే అని మంత్రి తెలిపారు. బేషరతుగా త‌న వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్న‌ట్లు  తెలిపారు. 

అయితే, ఆమె వ్యాఖ్యలపై తెలుగు చిత్ర సీమ భగ్గుమ‌న్న విష‌యం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ, సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ త‌ప్పేన‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, తార‌క్‌, అల్లు అర్జున్, ర‌వితేజ‌, నాని, మంచు విష్ణు, సుధీర్ బాబు, సమంత, నాగచైతన్య, అమల, అఖిల్, ఖుష్బూతో పాటు పలువురు సినీ రంగానికి చెందిన‌వారు మంత్రి వ్యాఖ్య‌ల‌ను ఖండించారు.

తాజాగా ఈ విష‌య‌మై తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ స్పందించింది. స‌మంత‌పై మంత్రి కొండా సురేఖ చేసిన‌ వ్యాఖ్య‌ల‌ను నిశితంగా ప‌రిశీలించిన‌ట్లు క‌మిష‌న్ వెల్ల‌డించింది. స‌మంత‌కు సురేఖ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోయి ఉంటే... వ్య‌వ‌హారం మ‌రోలా ఉండేద‌ని తెలిపింది. ఈ వ్య‌వ‌హారంలో ఇక త‌మ జోక్యం అవ‌స‌రంలేద‌ని భావిస్తున్న‌ట్లు మ‌హిళా క‌మిష‌న్ పేర్కొంది.  

ఇక మంత్రికి అక్కినేని నాగార్జున లీగ‌ల్ నోటీసులు ఇచ్చే అంశం పూర్తిగా ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని క‌మిష‌న్ చెప్పుకొచ్చింది. నాగ్ లీగల్ నోటీసులు ఇచ్చే యోచ‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో మ‌హిళా క‌మిష‌న్ ఇలా అభిప్రాయ‌ప‌డింది. మ‌రోవైపు కేటీఆర్ ఇప్ప‌టికే మంత్రి సురేఖ‌కు లీగ‌ల్ నోటీసులు పంపించిన విష‌యం తెలిసిందే.
Konda Surekha
Telangana State Commission for Women
Samantha
Telangana
Tollywood

More Telugu News