antonio guterres: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం .. ఐరాస చీఫ్ ఆంటోనియా గుటెర్రాస్‌పై నిషేధం

israels foreign minister says un chief will not be allowed to enter the country
  • ఇరాన్ దాడిని ఖండించని వారెవరైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదన్న ఇజ్రాయెల్
  • ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రాస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటన 
  • ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించిన ఇజ్రాయెల్ ప్రధాని  
ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెర్రాస్‌పై ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుటెర్రాస్‌పై నెతన్యాహు సర్కార్ నిషేధం విధించింది. తమ దేశంలో అడుగుపెట్టే అర్హత గుటెర్రాస్ కు లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. తమపై ఇరాన్ దాడిని గుటెర్రాస్ ఖండించలేదన్న కోపంలో నెతన్యాహు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న నెతన్యాహు సర్కార్ .. దీనికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇరాన్ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. 

తమపై ఇరాన్ చేసిన దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రాస్ ఖండించలేదని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు అండగా నిలుస్తున్నారని, ఐరాస చరిత్రపై ఆయన మాయని మచ్చ అంటూ తీవ్ర విమర్శలు చేసింది. గుటెర్రాస్ ఉన్నా .. లేకపోయినా .. ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకుంటుందని, దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ఐరాస చీఫ్ గుటెర్రాస్‌ను 'పర్సనా నాన్ గ్రాటా'గా ప్రకటించామని పేర్కొంటూ ...ఇజ్రాయెల్ లోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. 

ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కేబినెట్ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఇరాన్ చర్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిఫెన్స్ వ్యవస్థతో క్షిపణి దాడి విఫలమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన అమెరికాకు నెతన్యాహు ధన్యవాదాలు తెలియజేశారు.
antonio guterres
Israel
Iran
International news

More Telugu News