Iran: ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్.. 200లకుపైగా క్షిపణుల ప్రయోగం

Irans Revolutionary Guards issued its first statement after launching over 200 missiles at Israel
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు దిగింది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పైకి 200లకుపైగా క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. గత వారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా, ఐఆర్‌జీసీ జనరల్ అబ్బాస్, అంతకుముందు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మరణాలకు ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ దాడిని చేశామని తెలిపింది. తిరిగి దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది.

కాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) కూల్చివేసింది. ‘‘ మా దేశంలోని దాదాపు 10 మిలియన్ల మంది పౌరులే లక్ష్యంగా ఇరాన్ దాడి చేసింది. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించింది. లెబనాన్‌లో వరుస దాడులు, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణం నేపథ్యంలో దాడి జరగొచ్చని అమెరికా హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అధినేత హసన్ నస్రల్లా, దాదాపు 10 మిలియన్ల పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 200 క్షిపణులను ప్రయోగించింది’’ అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన అనేక క్షిపణులను వైమానిక దళం కూల్చివేసినట్లు పేర్కొంది.

ఇరాన్ క్షిపణి దాడుల కారణంగా సంభవించిన నష్టంపై ఎలాంటి సమాచారం లేదని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి  డేనియల్ హగారి తెలిపారు. ఈ దాడి తీవ్రమైనదిగా పరిగణిస్తున్నామని, పర్యవసానాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించాలని ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్టు అంతార్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఖమేనీ ఒక సురక్షిత ప్రదేశంలో ఉన్నారని సీనియర్ అధికారి ఒక పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా సాయం చేయాలని అమెరికా మిలిటరీని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు.

ఇక ఇరాన్ క్షిపణి దాడులకు దిగక ముందే సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులను ఇజ్రాయెల్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. బాంబు షెల్టర్లకు దగ్గరగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు పౌరుల ఫోన్లకే నేరుగా సందేశాలు పంపించింది. జాతీయ టీవీలో ప్రకటన కూడా చేసింది. కొన్ని ప్రాంతాల్లో సైరన్‌లను మోగించారు. ఈ తాజా పరిణామంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
Iran
Israel
Lebanon
USA

More Telugu News