Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 1877 తర్వాత ఇదే తొలిసారి

India became first team go past the 90 sixes mark in a single calendar year in test formate
  • టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఏడాది‌లో 90 సిక్సర్ల మైలురాయిని అందుకున్న తొలి జట్టుగా అవతరణ
  • ఈ ఘనత సాధించిన తొలి టీమ్‌గా చరిత్ర సృష్టించిన భారత్
  • కాన్పూర్ టెస్టులో భారత బ్యాటర్లు టీ20 తరహా బ్యాటింగ్ చేయడంతో దక్కిన రికార్డు
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు టీ20 తరహా బ్యాటింగ్ చేశారు. కేవలం 34.4 ఓవర్లలోనే 285 స్కోరు బాది ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. ఈ క్రమంలో టీమిండియా సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో 90 సిక్సర్ల మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి జట్టుగా భారత్ అవతరించింది. 

కాన్పూర్‌ టెస్టు 4వ రోజున భారత్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ చెలరేగి ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లను చితక్కొట్టారు. బ్యాటింగ్ ఆరంభంలోనే రోహిత్ శర్మ 3 సిక్సర్లు, జైస్వాల్ 2 సిక్సర్లు బాదారు. వీరిద్దరి ధాటికి భారత్ తొలి మూడు ఓవర్లలోనే 50 పరుగుల స్కోర్‌ను అందుకుంది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, ఆకాశ్ దీప్ చెరో 2, కోహ్లీ, శుభ్‌మాన్ గిల్ చెరొకటి చొప్పున సిక్సర్లు బాదారు. దీంతో ఈ ఏడాది టెస్టుల్లో భారత్ అందుకున్న సిక్సర్ల సంఖ్య 90 చేరింది. దీంతో ఇంగ్లాండ్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. 2022లో ఇంగ్లండ్ 89 సిక్సర్లు సాధించగా ఆ రికార్డును భారత్ చెరిపివేసింది.

1877లో టెస్ట్ క్రికెట్ ప్రారంభమవగా ఆ నాటి నుంచి ఏ జట్టూ ఒక్క క్యాలెండర్ ఏడాదిలో 90 సిక్సర్ల మైలురాయిని చేరుకోలేదు. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్‌ చరిత్ర సృష్టించింది. కాగా ఇంతకుముందు 2021లో భారత్ అత్యధికంగా 87 సిక్సర్లు బాదింది. ఇప్పటివరకు అదే అత్యుత్తమంగా కొనసాగింది.

టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్లు ఇవే..
1. భారత్ - 90 (2024)
2. ఇంగ్లండ్ - 89 (2022)
3. భారత్ - 87 (2021)
4. న్యూజిలాండ్ - 81 (2014)
5. న్యూజిలాండ్ - 71 (2013).
Team India
India Vs Bangladesh
Cricket
Kanpur test

More Telugu News