Nagababu: శ్రీవారి లడ్డూ వివాదంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నాగబాబు వివరణ

Nagababu explains Pawan Kalyan comments on Tirupati Laddu row
  • సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్
  • విమర్శనాత్మకంగా స్పందించిన ప్రకాశ్ రాజ్
  • ఎవరో ఏదో అన్నారని తాము పట్టించుకోబోమన్న నాగబాబు
  • పవన్ కల్యాణ్ నిజమైన లౌకికవాది అని వెల్లడి
తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. తిరుమల లడ్డూ అంశంపై ఇప్పటిదాకా సోషల్ మీడియాలో పరోక్ష వ్యాఖ్యలతో స్పందిస్తూ వచ్చిన నాగబాబు... తొలిసారి మీడియా ఎదుట ఈ అంశం గురించి మాట్లాడారు. 

తన కుమార్తె కొణిదెల నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రం ఈవెంట్ కు నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. పవన్ కల్యాణ్-ప్రకాశ్ రాజ్ మాటల యుద్ధం గురించి స్పందించాలని కోరింది. 

అందుకు నాగబాబు బదులిస్తూ... పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. సనాతన ధర్మంలో దేవుడు ఒక భాగం అని తెలిపారు. సనాతన ధర్మాన్ని అవమానించే వాళ్ల గురించే పవన్ కల్యాణ్ మాట్లాడాడని స్పష్టం చేశారు. మన దేశంలో అన్ని మతాల వాళ్లం కలిసి బతుకుతున్నామని, ఇది పెద్దల కాలం నుంచి వస్తోందని, పవన్ కల్యాణ్ మాట్లాడింది దీని గురించేనని వివరించారు. 

హైందవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేందుకు లడ్డూ అంశం పరాకాష్ఠ అని నాగబాబు పేర్కొన్నారు. హిందూ ధార్మిక సంస్థలను హిందువులే నడిపించాలని, కానీ అధికారంలో ఉన్న వారు తీసుకునే నిర్ణయాల వల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, పవన్ కల్యాణ్ ఈ అంశాన్నే ఎత్తిచూపారని వెల్లడించారు. 

ఇక్కడ ప్రకాశ్ రాజా, జగన్ మోహన్ రెడ్డా అనేది ప్రశ్నే కాదని, హిందువుల్లోనే ఉన్న కుహనా లౌకికవాదుల గురించే పవన్ కల్యాణ్ మాట్లాడారని నాగబాబు వివరించారు. 

పవన్ కల్యాణ్ నిజమైన లౌకికవాది అని, అన్ని మతాలతోనూ ఆయన సఖ్యంగా ఉంటారని... మదర్సాలకు మద్దతు ఇచ్చారని, విశాఖలో క్రిస్టియన్ మిషనరీస్ కు సంబంధించిన భూ వివాదంపై పోరాడారని వెల్లడించారు.  హిందువుల గురించి కూడా అదే విధంగా పోరాడుతుంటారని, ఎవరో ఏదో అన్నారని తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు. ధర్మం నిలబడాలన్నదే తమ అభిమతం అని పేర్కొన్నారు.
Nagababu
Pawan Kalyan
Tirupati Laddu
Prakash Raj
Janasena
Andhra Pradesh

More Telugu News