Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై పిటిషన్లు... సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court starts proceedings in Tirumala Laddu row
  • తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వ హయాంలోనే ఇదంతా జరిగిందని ఆరోపణ
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి తదితరులు
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది.

ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారం అని, రెండో అభిప్రాయం తీసుకోకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడారని ఆక్షేపించింది. కనీసం దేవుడ్ని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న దానికి ఆధారాలు ఏంటి? అని సూటిగా ప్రశ్నించింది. 

వాదనల సందర్భంగా... ఎన్ని నెయ్యి టాంకర్లు వినియోగించారన్న వివరాలను టీటీడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జూన్ నుంచి జులై వరకు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారో వివరించారు. లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీ చేసి, నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ ఫుడ్స్ కు చెందిన ట్యాంకర్లను పరీక్షకు పంపారని టీటీడీ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఆ రిపోర్టు ఆధారంగానే, లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు నిర్ధారణకు వచ్చారని తెలిపారు. 

దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ... కేవలం ఒక్క ల్యాబ్ లోనే కాకుండా... ఘజియాబాద్, మైసూర్ లలో ఉన్న ల్యాబ్ లలో నెయ్యి శాంపిల్స్ ను ఎందుకు పరీక్ష చేయించలేదు? దర్యాప్తు పూర్తి కాకుండానే కల్తీ జరిగిందని ఎలా చెబుతారు?  అని ప్రశ్నించింది.  అనంతరం తదుపరి విచారణను అక్టోబరు 3కి వాయిదా వేసింది.
Tirumala Laddu
Supreme Court
TDP-JanaSena-BJP Alliance
YSRCP
Andhra Pradesh

More Telugu News