Om Namo Narayanaya: కీర‌వాణికి థాంక్స్ చెప్పిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణం ఇదే!

Pawan Kalyan Special Thanks To Music Director MM Keeravani
  • ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఆడియో రూపంలో తీసుకొచ్చిన కీర‌వాణి
  • మంత్రాన్ని సులువుగా పఠించేందుకు వీలుగా ఇలా చేసినందుకు కీర‌వాణికి ప‌వ‌న్ థాంక్స్‌
  • ఈ మేర‌కు ప్ర‌త్యేకంగా లేఖ‌ను విడుద‌ల చేసిన జ‌న‌సేనాని  
ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా తిరుమల శ్రీవారి ప్ర‌సాదం లడ్డు వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుండి ప్రభుత్వం తరపున, సనాతన ధర్మం తరపున మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. 

తాజాగా నారాయణుని స్మరణ కోసం 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని సాధార‌ణ ప్ర‌జ‌లు సైతం సులువుగా పఠించేందుకు అనువుగా సంగీత దర్శకుడు కీరవాణి ప్రత్యేకంగా చిన్న ఆడియోను రూపొందించారు. దాంతో కీరవాణికి జ‌న‌సేనాని ప్రత్యకంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఒక లేఖను విడుదల చేశారు.

ప‌వ‌న్‌ లేఖ‌లో ఏముందంటే..

" ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ప్రజానీకం పఠించేందుకు అనువుగా ఆడియో రికార్డు రూపొందించిన ప్రముఖ సంగీత దర్శకులు ఎం. ఎం. కీరవాణికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం భక్తి భావం కలిగిన ప్రతి ఒక్కరికీ తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఆవేదన నుంచే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించాను. 

ఈ దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతోపాటు ధార్మిక విశ్వాసాలు కలిగినవారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారు. వారంతా ఓం నమో నారాయణాయ మంత్రం పఠిస్తున్నారు. అందుకు అనువుగా కీరవాణి ఆడియో రికార్డు చేశారు. అది భక్తి భావంతో సాగింది. ఇందులో భాగం పంచుకున్న సంగీత కళాకారులకి, సాంకేతిక నిపుణులకి ధన్యవాదాలు" అని జ‌న‌సేనాని త‌న లేఖ‌లో రాసుకొచ్చారు.
Om Namo Narayanaya
Pawan Kalyan
MM Keeravani
Andhra Pradesh

More Telugu News