Tirupati Laddu: లడ్డూ వ్యవహారంలో మూడు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నాం: సిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి

SIT continues probe on day 2
  • తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం
  • సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
  • గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో సిట్ దర్యాప్తు
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంలో సిట్ రెండో రోజు కూడా విచారణ షురూ చేసింది. తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ సభ్యులు మరోసారి సమావేశం అయ్యారు. గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలోని సిట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగించాలని నిర్ణయించారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్థన్ రాజు, అడిషనల్ ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లనున్నారు. 

విచారణలో భాగంగా... సిట్ అధికారులు టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిశీలించారు. టీటీడీ బోర్డు దగ్గర్నుంచి, ఇతర అధికారులు, సిబ్బంది పాత్ర వరకు సమగ్రంగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. సిట్ అధికారుల్లోని ఓ బృందం తమిళనాడులోని దుండిగల్ వెళ్లి, టీటీడీకి నెయ్యి సరఫరా చేసే ఏఆర్ ఫుడ్స్ సంస్థను పరిశీలించనుంది. 

మరో బృందం తిరుమలలోని లడ్డూ పోటు, విక్రయ బృందాలను, లడ్డూ తయారీకి ఉపయోగించే ముడిసరుకులను పరిశీలించనుంది. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మరో బృందం టీటీడీ పరిపాలనా భవనంలో విచారణ చేపట్టనుంది. నెయ్యి కొనుగోలు, సరఫరా అంశాల్లో టీటీడీ, ఏఆర్ ఫుడ్స్ డెయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. 

కాగా, ఇవాళ పోలీస్ గెస్ట్ హౌస్ లో భేటీ అనంతరం సిట్ అధికారులు టీటీడీ ఈవో జె.శ్యామలరావును కలిశారు. తిరుపతిలోని ఈవో బంగ్లాలో ఈ సమావేశం జరిగింది. అనంతరం, సిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి మీడియాతో మాట్లాడారు. 

లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తామని చెప్పారు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును సిట్ కు బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ డెయిరీపై విచారణ చేపడతామని వెల్లడించారు. సిట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి విచారణలో పాలుపంచుకుంటారని ఐజీ వివరించారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ విచారిస్తామని, దీనిపై నివేదిక సమర్పించడానికి కాలపరిమితి ఏమీ లేదని స్పష్టం చేశారు.
Tirupati Laddu
SIT
Ghee
Adulteration
Tirumala

More Telugu News