Dana Kishore: బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందే: దానకిశోర్

Dana Kishore says houses should demolished any time in ftl
  • నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న దానకిశోర్
  • మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఎవరినీ బలవంతంగా పంపించడం లేదని వెల్లడి
  • మూసీకి వరద వస్తే ఇబ్బంది పడేది ప్రజలేనని వ్యాఖ్య
  • గతంలోనూ నిర్వాసితులను తరలించిన సందర్భాలు ఉన్నాయన్న దానకిశోర్
  • నిర్వాసితుల కోసం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశామన్న దానకిశోర్
బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనని మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ అన్నారు. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఎవరినీ బలవంతంగా పంపించడం లేదని, వారికి నచ్చజెప్పి తరలిస్తున్నట్లు చెప్పారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర అధికారులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మూసీకి వరద వస్తే ఇబ్బందిపడేది ప్రజలేనన్నారు. 1927లో వరదల కారణంగా భారీ నష్టం జరిగిందని దానకిశోర్ వెల్లడించారు. 

ప్రస్తుతం హైదరాబాద్‌లో కోటి జనాభా ఉందన్నారు. మూసీ పరివాహక ప్రాంతం మురికికూపంగా మారిందని, దానిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకొని క్షేత్రస్థాయి పర్యటనకు వెళతామన్నారు. మూసీ నది పరిసరాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 2030 కల్లా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, అందుకు అనుగుణంగా నగరాన్ని మార్చాల్సి ఉందన్నారు.

మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. మూసీ నీటి శుద్ధి కోసం రూ.3,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. 2026 జూన్ లోపు మూసీలో మంచి నీళ్లు ప్రవహించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఇళ్లు ఎప్పుడైనా తొలగించాల్సిందే అన్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామన్నారు. నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

 మూసీ నిర్వాసితుల కోసం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చట్టానికి లోబడి హైడ్రా, అధికారులు పని చేస్తున్నారన్నారు. మూసీ నిర్వాసితులతో సామరస్యంగా మాట్లాడి, వారిని డబుల్ బెడ్ రూం ఇళ్లకు తరలిస్తున్నట్లు చెప్పారు.

మూసీ నిర్వాసితులకు రూ.30 లక్షల విలువైన ఇళ్లు ఇస్తున్నాం

మూసీ నిర్వాసితుల్లో ఎవరికైనా పట్టాలు ఉంటే రెట్టింపు ధరలు చెల్లిస్తున్నామని వెల్లడించారు. మూసీ నిర్వాసితులకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన ఇళ్లను ఇస్తున్నామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్, వెస్ట్ కారిడార్‌ను నిర్మిస్తామన్నారు. 55 కిలోమీటర్ల పొడవైన కారిడార్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఈ కారిడార్ల నిర్మాణంతో ట్రాఫిక్ కూడా తగ్గుతుందని వెల్లడించారు.

మూసీ ఆధునికీకరణకు ప్రజలు సహకరించాలని కోరారు. వ్యాపారాలు కూడా పెరుగుతాయని వెల్లడించారు. మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులు నిర్మిస్తామన్నారు. పట్టా ఉన్నవాళ్లకు పరిహారం చెల్లించాకే ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్‌లో ఎలాంటి భవనాలు ఉన్నా తొలగిస్తామని స్పష్టం చేశారు.
Dana Kishore
HYDRA
Musi
Telangana
Hyderabad

More Telugu News