New Delhi: ఢిల్లీలో విషాదం.. తండ్రి, నలుగురు కుమార్తెల ఆత్మహత్య

Bihar Man and His Four Specially Abled Daughters Allegedly End Lives In Rangpuri
  • బీహార్ నుంచి వలస వచ్చిన కుటుంబం
  • కుమార్తెలు నలుగురూ దివ్యాంగులే
  • మూడు రోజుల క్రితమే విషం తాగి ఆత్మహత్య
  • ఇరుగుపొరుగు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి దివ్యాంగులైన తన నలుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగపురి ప్రాంతంలో జరిగిందీ ఘటన. వారందరూ విషం తాగి మరణించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తోందంటూ చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూసి షాకయ్యారు. ఐదుగురి మృతదేహాలు ఒకదాని పక్కన ఒకటి పడి వున్నాయి. మూడు రోజుల క్రితమే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. 

ఇంటి పెద్ద వయసు 50 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. వసంత్‌కుంజ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతడు కార్పెంటర్‌గా పనిచేస్తూ రంగపురి గ్రామంలో నివసిస్తున్నాడు. ఆ కుటుంబం బీహార్‌లోని చాప్రా నుంచి వలస వచ్చినట్టు గుర్తించారు. పిల్లల తల్లి కొన్నేళ్ల క్రితమే క్యాన్సర్‌తో మరణించింది. ఇంట్లో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
New Delhi
Rangapuri
National News
Mass Suicide In Delhi

More Telugu News