Raghunandan Rao: జగన్‌కు ఇదే మా ఆహ్వానం, తిరుమలకు రండి... కానీ!: రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

Raghunandan Rao welcomes Jagan to Tirumala after declatation
  • డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే తిరుమలకు రావాలన్న రఘునందన్ రావు
  • డిక్లరేషన్‌పై సంతకం పెట్టడం ఇష్టం లేకే పర్యటన రద్దు చేసుకున్నారని ఆరోపణ
  • డిక్లరేషన్ నిబంధన ఎప్పటి నుంచో ఉందని వెల్లడి
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు అంశంపై తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. "జగన్ రాకను మేమెవ్వరం అడ్డుకోం. మీరు తిరుమలకు రండి.. మాజీ సీఎం జగన్‌కు ఇదే మా ఆహ్వానం. కానీ డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందే" అని స్పష్టం చేశారు.

మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ మాట్లాడుతూ... ఒక మాజీ సీఎంనే గుడిలోకి రానివ్వకపోతే ఇక దళితుల పరిస్థితి ఏమిటని జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ తప్పుబట్టారు. అసలు డిక్లరేషన్‌పై ఎక్కడ సంతకం పెట్టవలసి వస్తుందోననే ఆలోచనతోనే జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారన్నారు.

డిక్లరేషన్ నిబంధన ఒక్క జగన్‌కు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందనే విషయం తెలుసుకోవాలన్నారు. తాను ఐదుసార్లు తిరుమల వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించానని జగన్ చెబుతున్నారని, కానీ ఆయన సీఎంగా వెళ్లాడని తెలిపారు. సీఎం కాకముందు పాదయాత్రలో భాగంగా తిరుమల వెళ్లారని గుర్తు చేశారు.

కానీ ఈ రోజు లడ్డూ ప్రసాదం అపవిత్రంపై విమర్శలు వస్తున్న సమయంలో ఆయన తిరుమల వస్తానని చెప్పారని తెలిపారు. అందుకే శ్రీవారి భక్తులు, హిందూ సమాజం డిక్లరేషన్ ఇవ్వాలని కోరుతోందన్నారు. తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవడానికి డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది కదా అన్నారు. కానీ డిక్లరేషన్‌కు ఎందుకు వెనుకాడుతున్నారని విమర్శించారు.

చర్చిల యజమానులతో లేదా పాస్టర్లతో లేదా విదేశాల నుంచి వచ్చే నిధుల్లో ఇబ్బందులు వస్తాయని భావించి జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదా? అని నిలదీశారు. నిత్యం లక్షలాది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని, ఇందులో వేలాదిమంది దళితులు ఉంటారన్నారు. కానీ జగన్ ఇక్కడ కుల పంచాయితీని ఎందుకు తీసుకు వస్తున్నాడని మండిపడ్డారు.

జస్ట్ ఒక్క సంతకం పెట్టండి చాలు...

మాజీ సీఎంను రానీయరా? అని జగన్ అడుగుతున్నారని, కానీ అలిపిరి వద్దే డిక్లరేషన్ పత్రం ఇస్తాం... దానిపై ఒక్క సంతకం పెడితే చాలు ఆయనకు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుందన్నారు. లడ్డూ ప్రసాదం విషయంలో పాత పద్ధతినే అవలంభించామని చెబుతున్న జగన్‌కు డిక్లరేషన్ కూడా ఎప్పటి నుంచో వస్తున్న నిబంధన అని తెలియదా? అని ప్రశ్నించారు. తిరుమలతో పాటు పెద్ద పెద్ద ఆలయాల్లో డిక్లరేషన్ ఉందని గుర్తు చేశారు. జగన్ తండ్రి వైఎస్ కంటే ముందు కూడా ఈ డిక్లరేషన్ ఉందన్నారు.

ఇతర మతస్తులు దేవాలయాల్లోకి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఎప్పటి నుంచో ఉందని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఉందని తెలిపారు. ఈ డిక్లరేషన్‌ను బీజేపీనో, రఘునందన్ రావో తీసుకు రాలేదన్నారు. అసలు డిక్లరేషన్‌పై సంతకం పెట్టడం జగన్‌కు ఇష్టం లేదన్నారు. డిక్లరేషన్‌కు, బీజేపీకి సంబంధమేమిటో అర్థం కావడం లేదని విమర్శించారు. జగన్ శ్రీవారి దర్శనం కోసం వెళితే కచ్చితంగా డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సిందే అని తేల్చి చెప్పారు. తాను స్పందించడానికి కూడా కారణం ఉందని తెలిపారు. జగన్ తన మాటల మధ్యలో బీజేపీ ప్రస్తావన తీసుకు వచ్చారని, అందుకే తాను మాట్లాడవలసి వచ్చిందన్నారు.
Raghunandan Rao
YS Jagan
Tirumala
Telangana
Andhra Pradesh
Laddu

More Telugu News