పిల్లల ప్రాణాలతో తండ్రి చెలగాటం.. సింహం వీపు మీదకి ఎక్కించి ఫొటో షూట్.. ఆ తర్వాత జరిగింది ఇదీ!
- ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో
- పిల్లలను సింహం వీపుపైకి ఎక్కించి కలిసి ఫొటోలు
- విరుచుకుపడుతున్న నెటిజన్లు
సింహంతో ఫొటో దిగాలనుకున్న ఓ వ్యక్తి తొలుత తన కుమారుడిని సింహం వీపు పైకి ఎక్కించాడు. పిల్లాడు భయపడుతున్నా బలవంతంగా దానిపై కూర్చోబెట్టి ఇద్దరూ కలిసి ఫొటో దిగారు. ఆ తర్వాత మరో కుమారుడిని కూడా ఎక్కించాడు. ఇంత జరుగుతున్నా సింహం మాత్రం కాసేపు ఓపిగ్గానే ఉంది. ఆ తర్వాత ఓపిక నశించి ఒక్కసారిగా తల విసరడంతో భయంతో హడలిపోయారు. వారు కాసేపు అక్కడే ఉండి అలాగే ప్రవర్తించి ఉంటే ముగ్గురూ దానికి ఆహారంగా మారిపోయేవారు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ తండ్రిపై విరుచుకుపడుతున్నారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, అతడసలు మంచి తండ్రి కానేకాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు తన పరిధిని దాటాడని మరికొందరు మండిపడుతున్నారు. మరికొందరేమో ఆ సింహానికి మత్తు మందు ఇచ్చి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ఎవరో ఒకరు దాని నోటికి చిక్కేంత వరకు ఇది సరదాగానే ఉంటుందని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. అయితే, ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయం తెలియరాలేదు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి