ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ విడుదల.. టాప్-10లో కోహ్లీ పేరు గల్లంతు

Virat Kohli has dropped out top 10 in the latest ICC Test rankings
  • 12వ స్థానానికి దిగజారిన విరాట్ కోహ్లీ
  • 5వ ర్యాంక్ నుంచి 10వ ర్యాంకుకు పడిపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ
  • టాప్-10లోకి దూసుకొచ్చి 6వ స్థానంలో నిలిచిన రిషబ్ పంత్
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 899 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ వరుసగా 2, 3వ స్థానాల్లో నిలిచారు. ఆసీస్ ఆటగాడు స్టీవెన్ స్మిత్, భారత యువ కెరటం యశస్వి జైస్వాల్‌ వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచారు. 
 
కాగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ టాప్ 10లోకి ప్రవేశించి 6వ స్థానాన్ని దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 39 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో అతడి ర్యాంకు మెరుగుపడింది. ఇక బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్-10లో స్థానం కోల్పోయాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం 11వ స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 5 స్థానాలు దిగజారి 12వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ముందు 5వ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 10వ స్థానానికి దిగజారాడు. మిగతా భారత బ్యాటర్ల విషయానికి వస్తే శుభ్‌మాన్ గిల్ 14వ స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్ 27న కాన్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో రాణిస్తే  రోహిత్ శర్మ, కోహ్లీ ర్యాంకులు మెరుగుపడే అవకాశం ఉంది.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే శ్రీలంక యువ ఆటగాడు 5 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక నంబర్ వన్ స్థానంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, 2వ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా నిలిచారు. ఆ తర్వాత వరుస స్థానాల్లో ఆస్ట్రేలియా బౌలర్లు హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ నిలిచారు. భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో, నాథన్ లియాన్ 7వ ర్యాంక్‌లో నిలిచారు.
ICC Test Rankings
Virat Kohli
Cricket
Team India
India Vs Bangladesh

More Telugu News