IPL: ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీలు వదులుకోనున్న స్టార్ క్రికెటర్లు వీళ్లేనా?

Take a look at 5 cricketing superstars who could be released by their respective franchises ahead of the mega auction
  • రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ వదులుకోవచ్చని ఊహాగానాలు
  • కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేయవచ్చని అంచనాలు
  • మెగా వేలం 2025లో మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, వెంకటేష్ అయ్యర్ ఉండొచ్చంటూ క్రికెట్ వర్గాల్లో విశ్లేషణలు
ఐపీఎల్ 2025 మెగా వేలంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఫ్రాంచైజీలు గరిష్ఠంగా ఎంతమంది ఆటగాళ్లను నిలుపుదల చేసుకోవచ్చు? వేలం మార్గదర్శకాలు ఏంటి? అనే అంశాలపై బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ... ఫ్రాంచైజీలు రిటెయిన్, రిలీజ్ చేసుకునే ఆటగాళ్లపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు మెగా వేలానికి ముందు కొందరు స్టార్ క్రికెటర్లను వదులుకునే అవకాశం ఉందంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఐదుగురు క్రికెటర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ స్టార్ ఆటగాళ్లు ఎవరో ఈ కథనంలో చూద్దాం..

రోహిత్ శర్మ..
ఈసారి ఐపీఎల్ మెగా వేలం జాబితాలో అందుబాటులో ఉండొచ్చని భావిస్తున్న స్టార్ క్రికెటర్లలో రోహిత్ శర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టులో జరిగిన పరిణామాలే ఈ అంచనాలకు కారణమవుతున్నాయి. కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించడం పెద్ద దుమారాన్నే రేపింది. ఇక అభిషేక్ నాయర్‌తో మాట్లాడుతూ ముంబై ఇండియన్స్‌తో 2024 సీజనే తనకు చివరిదని రోహిత్ వ్యాఖ్యానించడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది. ముంబయికి పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి ఐపీఎల్ 2025 సీజన్‌లో రోహిత్ కొత్త జట్టుకు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంచనాలు నెలకొన్నాయి.

కేఎల్ రాహుల్...
కొత్త కెప్టెన్‌ కావాలని లక్నో సూపర్ కింగ్స్‌ యాజమాన్యం యోచిస్తున్నట్టు గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌ను విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు. వ్యక్తిగతంగా రాణించలేకపోవడం, కెప్టెన్‌గానూ మెప్పించలేకపోవడంతో అతడిని రిటెయిన్ చేసుకోవడం ప్రశ్నార్థకమవ్వొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీమిండియా టీ20 జట్టులో కూడా కేఎల్ రాహుల్‌కు చోటు దక్కడం లేదు. దీంతో అతడిని లక్నో సూపర్ జెయింట్స్ వదులుకోవచ్చనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఫాఫ్ డు ప్లెసిస్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గత ఐపీఎల్ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. జట్టును కూడా ఆశించిన స్థాయిలో నడిపించలేదు. ఇక వయసు కూడా 40 ఏళ్లు పైబడడంతో టీ20 ఫార్మాట్‌లో అతడి అత్యుత్తమ కాలం ముగిసిపోయినట్టేనన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక పటిష్టమైన జట్టుని రూపొందించే క్రమంలో ఆర్సీబీ కొత్త సారథిని కూడా నియమించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్సీబీ వదులుకునే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చు.

వెంకటేష్ అయ్యర్..
ఏయే ఆటగాళ్లను నిలుపుదల చేసుకోవాలి, ఎవరెవర్ని వదులుకోవాలనే సందిగ్దం కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలో నెలకొంది. 5 లేదా 6 మంది ఆటగాళ్లను మాత్రమే రిటెయిన్ చేసుకునే అవకాశం ఉండడం ఆ జట్టుకి తలనొప్పిగా మారే ఛాన్స్ ఉంది. స్టార్ ప్లేయర్లు సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, రింకూ సింగ్, మిచెల్ స్టార్క్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఫిల్ సాల్ట్‌లకు ప్రాధాన్యం ఇస్తే వెంకటేష్ అయ్యర్‌కు నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతడిని కోల్‌కతా వదులుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

గ్లెన్ మాక్స్‌వెల్..
ఆర్సీబీ స్టార్ ప్లేయర్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 2024 సీజన్‌లో పేలవమైన ప్రదర్శన చేశాడు. ఫ్రాంచైజీ గత సీజన్‌లో ఏకంగా రూ.14.25 కోట్లు వెచ్చించి దక్కించుకుంటే అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఈ ఆస్ట్రేలియా ఆటగాడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వదులుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే వేలంలో మరేదైనా జట్టు దక్కించుకునే అవకాశాలు ఉంటాయి.
IPL
IPL Auction 2025
Cricket
Rohit Sharma
KL Rahul

More Telugu News