Sunitha Laxma Reddy: మా ఇంటికి వచ్చి కావాలని దాడి చేశారు: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

Sunitha Laxma Reddy responds on attack on her house
  • గోమారంలోని తన ఇంటిపై దాడి జరిగిందన్న మాజీ మంత్రి
  • గేటు లోపలకు వచ్చి మరీ దాడి చేశారని ఆవేదన
  • ఇంటి ముందు కావాలని టపాసులు పేల్చారన్న సునీతా లక్ష్మారెడ్డి
కాంగ్రెస్ కార్యకర్తలు కావాలనే తమ ఇంటి ముందు టపాసులు పేల్చారని, లోపలకు వచ్చి ఇద్దరిపై దాడి చేశారని, ఇది కావాలని చేసిన దాడి అని నర్సాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... గోమారంలోని తన ఇంటిపై దాడి జరిగిందని వాపోయారు. గేటు లోపలకు వచ్చి మరీ దాడి చేశారన్నారు.

మహిళా ఎమ్మెల్యే ఇంటిపై దాడులు చేయడం, కావాలని టపాసులు పేల్చడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారన్నారు.

సునీతా లక్ష్మారెడ్డి ఇంటికి బయలుదేరిన హరీశ్ రావు

సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆమెను పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కు బయల్దేరారు. మరోవైపు, సునీతా లక్ష్మారెడ్డికి కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Sunitha Laxma Reddy
BRS
Congress
Telangana

More Telugu News