Chandrababu: తప్పు చేసి ప్రధానికి లేఖ రాయడానికి నీకు బుద్ధి ఉండక్కర్లా!: జగన్ పై చంద్రబాబు ఫైర్

Chandrababu questions Jagan written letter to PM Modi
  • తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న తిరుమల లడ్డూ వ్యవహారం
  • ప్రధానికి లేఖ రాసిన జగన్
  • నీది అసలు మనిషి పుట్టుకేనా? అంటూ చంద్రబాబు ఆగ్రహం
  • నువ్వు ఏంచేసినా నడుస్తుందనుకుంటున్నావా? అంటూ మండిపాటు
తిరుపతి లడ్డూ వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తప్పు చేసిందే కాకుండా, పైగా ప్రధానికి లేఖ రాయడం కూడానా! అంటూ మండిపడ్డారు. తప్పిదానికి పాల్పడి ప్రధానికి లేఖ రాయడానికి బుద్ధి ఉండక్కర్లా? నువ్వు ఏం చేసినా నడుస్తుందనుకుంటున్నావా? నీది అసలు మనిషి పుట్టుకేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అరిచి గీపెట్టి, హైరేంజిలో బుకాయిస్తే మీ పాపాలు కొట్టుకుని పోతాయా? అని ప్రశ్నించారు. శ్రీవారికి తీరని ద్రోహం చేసి చరిత్రహీనులయ్యారని... ఇప్పుడు న్యాయమా? ధర్మమా? అంటూ నీతి వచనాలు పలుకుతున్నారని చంద్రబాబు విమర్శించారు. 

గతంలో సోనియా గాంధీ, అబ్దుల్ కలాం వంటివారే తిరుమల వచ్చినప్పుడు, వెంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని అఫిడవిట్ ఇచ్చారని, వాళ్లకంటే మీరు గొప్పవాళ్లా? అని నిలదీశారు. భూమన తన కుమార్తె పెళ్లిని క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేశారని చంద్రబాబు వెల్లడించారు. అలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పటికీ క్షమించరాని నేరం చేశారని అన్నారు. 

కాగా, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఐజీ స్థాయి అధికారితో సిట్ వేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని, సిట్ దర్యాప్తు చేసి రిపోర్టు ఇస్తుందని తెలిపారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారం తొలగిపోయేందుకు రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతిహోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పంచద్రవ్య సంప్రోక్షణ కూడా చేపడతామని పేర్కొన్నారు.
Chandrababu
Jagan
Narendra Modi
Tiruapti Laddu

More Telugu News