Temple Chief Priest: తెలంగాణలోని ప్రముఖ ఆలయ ప్రధాన పూజారి, కొడుకుపై లైంగిక వేధింపుల కేసు.. సస్పెన్షన్ వేటు

Telangana Temple Priest And His Son Suspended For Sexual Harassment
  • తనను లైంగికంగా వేధిస్తూ, వరకట్నం కోసం హింసిస్తున్నారంటూ ప్రధాన పూజారి కోడలు ఫిర్యాదు
  • గత నెల 14 ఏపీలోని తాడేపల్లిగూడెంలో ఫిర్యాదు చేసిన బాధితులు
  • తాజాగా ఎఫ్ఐఆర్ కాపీ అందడంతో చర్యలు
  • అర్చకత్వ గౌరవాన్ని కాపాడాలనే వేటు వేసినట్టు చెప్పిన ఈవో ఎల్.రమాదేవి
తెలంగాణలోని ప్రముఖ ఆలయానికి చెందిన ప్రధాన పూజారి, అదే ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న ఆయన పెంపుడు కుమారుడిని ఆలయ అధికారులు సస్పెండ్ చేశారు. వరకట్నం, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకున్నట్టు ఎగ్జిక్యూటివ్ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు. ప్రధాన పూజారి కోడలు ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంలో వీరిద్దరిపై ఫిర్యాదు చేసినట్టు ఆమె పేర్కొన్నారు.

ఆగస్టులోనే వారిపై తాడేపల్లిగూడెంలో కేసు నమోదైనట్టు రమాదేవి తెలిపారు. తాజాగా ఆ ఎఫ్ఐఆర్ కాపీ తమకు అందిందని, వారిపై లైంగిక ఆరోపణలు కూడా ఉన్నాయని వివరించారు. అర్చకత్వ గౌరవం కాపాడాలన్న ఉద్దేశంతో వారిద్దరినీ సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. 

ప్రధాన పూజారి, ఆయన కుమారుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు తాడేపల్లిగూడెం టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎ.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో వారిని కలిసేందుకు వెళితే అందుబాటులో లేరని, త్వరలోనే వారిని విచారిస్తామని తెలిపారు.

బాధితురాలు ఆగస్టు 14న ఫిర్యాదు చేసిందని, తనను లైంగికంగా వేధించడంతోపాటు రూ. 10 లక్షల కట్నం తీసుకురావాలని వారి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన పూజారికి మగ పిల్లలు లేకపోవడంతో తన భర్తను కొన్నేళ్ల క్రితం దత్తత తీసుకున్నారని, తాడేపల్లిగూడెంకు చెందిన తనకు అతనితో 2019లో వివాహమైందని ఆమె పేర్కొన్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నారని, ఆ తర్వాతి నుంచి వేధించడం మొదలుపెట్టారని ఆరోపించారు. కాగా, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ దేవాదాయశాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఈవో వారిని సస్పెండ్ చేశారు.
Temple Chief Priest
Sexuall Allegations
Temple Priest
Telangana
Andhra Pradesh

More Telugu News