Chandrababu: కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు పిలుపు

Andhra Pradesh CM Chandrababu Special Meeting With Mlas Today
  • మంగళగిరిలో నేడు 4 గంటలకు మీటింగ్
  • వంద రోజుల పాలనపై ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ కార్డులు
  • భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో జరగనున్న ఈ సమావేశానికి రమ్మంటూ కూటమి ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తప్ప మూడు పార్టీల ఎమ్మెల్యేలకు ఇప్పటికే పిలుపు అందింది. ఈ సమావేశంలో వంద రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను చంద్రబాబు వివరించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి రిపోర్ట్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం.

ప్రోగ్రెస్ కార్డులు సిద్ధమైతే ఎమ్మెల్యేలకు విడివిడిగా ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ ప్రోగ్రెస్ కార్డులు సిద్ధం కాకుంటే తర్వాత ఇవ్వనున్నారు. మీటింగ్ లో భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చిస్తారని, మీటింగ్ మూడు గంటలకు పైగా జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జులు, ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. కాగా, బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు.
Chandrababu
NDA
MLAs
Andhra Pradesh
Mangalagiri

More Telugu News