Delhi: అతిశీ ఎన్నికకు కారణం ఇదేనట..!

Why Arvind Kejriwal Chose Atishi As New Chief Minister
  • అతిశీకి ఉన్న క్లీన్ ఇమేజ్
  • కేజ్రీవాల్, సిసోడియాలకు అత్యంత నమ్మకస్తురాలు
  • ప్రభుత్వంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి కావడమే కారణం
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ కొత్త సీఎంగా అతిశీని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలను సరిగ్గా నిర్వహించగల లీడర్ ఆమేనని వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలతో జైలుపాలైన కేజ్రీవాల్.. బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి కేజ్రీవాల్ రాజీనామా లేఖను అందజేయనున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం, మంగళవారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేతలతో కేజ్రీవాల్ భేటీ అయ్యారు.

పలు దఫాలుగా చర్చలు జరిపి కొత్త సీఎంగా అతిశీని ఎంపిక చేశారు. లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో ఆయన అతిశీ పేరును ప్రతిపాదించగా.. నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని సమాచారం. అయితే, పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఉండగా వారందరినీ కాదని అతిశీని ఎంపిక చేయడం వెనక కారణం ఏంటనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆప్ వర్గాలు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల మేరకు అతిశీని ఎంపిక చేయడానికి కారణాలు ఇవేనని తెలుస్తోంది..

అతిశీకి ఉన్న క్లీన్ ఇమేజ్.. ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన అతిశీ ఇప్పటి వరకు క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్నారు. ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అరవింద్ కేజ్రీవాల్ కు మనీశ్ సిసోడియాకు అతిశీ అత్యంత నమ్మకస్తురాలు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ నిర్మాణంలో ఆమె కీలక పాత్ర పోషించారు. వివిధ కేసులతో ఆప్ సీనియర్ నేతలు జైలు పాలవగా అప్పటి వరకు వారు చూస్తున్న శాఖలను అతిశీ చేపట్టారు. ఢిల్లీ మంత్రిగా ప్రస్తుతం అతిశీ చేతిలో కీలకమైన విద్య, వైద్యం సహా మొత్తం 14 శాఖలు ఉన్నాయి. వీటితో పాటు ఢిల్లీ ప్రభుత్వంలో ఏకైక మహిళా మంత్రి కావడంతో వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించగలదని కేజ్రీవాల్ భావిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
Delhi
New CM
Atishi
Arvind Kejriwal
AAP

More Telugu News