Aadhaar: ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం

free aadhaar card update uidai extends deadline to december 2024
  • ప్రతి పదేళ్లకు ఒకసారి వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి  
  • శనివారంతో ముగిసిన గడువు 
  • డిసెంబర్ 14వరకు ఉచిత ఆధార్ అప్‌డేట్ అవకాశం
దేశంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు వినియోగం ఎంతో కీలకంగా మారింది. వ్యక్తుల వ్యక్తిగత గుర్తింపు కార్డు అయిన ఆధార్ .. మొబైల్ సిమ్ కార్డు కొనుగోలుకు మొదలు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడం, వాహనాలు, భూములు, ఇళ్లు క్రయవిక్రయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యార్ధులకు ఉపకార వేతనాలు వంటి అనేక అంశాలలో తప్పనిసరిగా మారింది. అయితే.. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల ముఖాల్లో మార్పులు వస్తుండటం సర్వసాధారణం. అంతే కాకుండా ఇంటి చిరునామాలు మారుతుండటంతో అటు అధికారులు, ఇటు అధార్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. 

ఈ సమస్య నుండి బయటపడేందుకు ప్రతి పదేళ్లకు ఒక సారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది ఏళ్లు గడుస్తున్నా ఆధార్ అప్ డేట్ చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి అధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. అయితే కేంద్రం ఇచ్చిన గడువు శనివారంతో ముగిసింది. 

ఈ నేపథ్యంలో ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరోసారి పొడిగించింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలను అప్ డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఉడాయ్ అధికారిక వెబ్ సైట్ http://myaadhar.uidai.gov.in లో అధార్ నెంబర్, మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ అయి వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు.
Aadhaar
UIDAI
national news
aadhaar card update

More Telugu News