Bhadradri Kothagudem District: ఇది దైవ ద్రోహం.. 'శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ' కార్యకలాపాలపై భద్రాచలం ఆలయ ఈవో ఆగ్రహం

Bhadrachalam EO about American temple Khagola Yatra
  • "శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ" ఆధ్వర్యంలో ఖగోళయాత్ర
  • రేపు భద్రాచలంలో శాంతికల్యాణం నిర్వహిస్తున్నట్లు వెల్లడి
  • అనుమతి లేకుండా భద్రాచల రాముడిని ఉపయోగించకూడదన్న ఈవో
భద్రాచల రాముడి పేరిట పేటెంట్ హక్కు తీసుకోవడానికి దేవాదాయ శాఖ ద్వారా దరఖాస్తు చేశామని భద్రాచలం రామాలయ ఈవో రమాదేవి తెలిపారు. 'శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ' ఆధ్వర్యంలో రేపు భద్రాచలంలో ఓప్రైవేటు సత్రంలో శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన పత్రికను ముద్రించిన నేపథ్యంలో ఈవో స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పేరుతో అనుమతులు లేకుండా ఎలాంటి కల్యాణాలు, హోమాలు, జపాలు చేయకూడదన్నారు. అలాంటి వారు దేవుడి పేరు, వెబ్ సైట్ చిరునామా, స్వామివార్ల చిత్రాలను ఉపయోగించడం నేరమని ఈవో తెలిపారు.

శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో రామాలయాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు ఖగోళయాత్ర నిర్వహించారని తెలిపారు. అయితే ఈ నెల 17న భద్రాచలంలో శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారని, ఇది చూసి తాము ఆశ్చర్యపోయామన్నారు. భద్రాద్రి రామాలయం తరఫున ఖగోళయాత్ర చేస్తున్నట్లుగా అందులో ఉందన్నారు. ఈ పేరుతో విరాళాలు సేకరించారన్నారు. ఇది దైవద్రోహం కిందకు వస్తుందని, దీనికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్‌కు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు.

వ్యక్తిగత సెలవులు తీసుకున్న భద్రాచల రామాలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు, అర్చకుడు సీతారాం ఖగోళయాత్రలో పాల్గొన్నారని పేర్కొన్నారు. భద్రాచల ఆలయం పేరుతో కల్యాణాలు చేస్తున్న విషయాన్ని వారు కూడా తమ దృష్టికి తీసుకు రాలేదన్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.
Bhadradri Kothagudem District
Lord Rama
Telangana

More Telugu News