Satya Kumar: పాఠాలు కూడా మీరే చెబుతారా ప్రొఫెసర్ జగన్?: మంత్రి సత్యకుమార్

Minister Satya Kumar fires on former chief minister YS Jagan
  • నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలల పరిస్థితిపై మంత్రి సత్యకుమార్ స్పందన
  • నాలుగేళ్లయినా ఒక్క కాలేజీ నిర్మాణం పూర్తి చేయలేకపోయారని విమర్శలు
  • పులివెందుల కాలేజీలో బోధనా సిబ్బంది కొరత ఉందని వెల్లడి
  • పాఠాలు ఎవరు చెప్పాలని నిలదీసిన వైనం
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ వంటి అసమర్థ వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో! అంటూ విమర్శనాత్మకంగా స్పందించారు. 

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించారని, నాలుగేళ్లయినా ఒక్క కాలేజీ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని వెల్లడించారు. సగానికి పైగా కాలేజీల నిర్మాణం పునాదుల దశల్లోనే ఉందని మంత్రి సత్యకుమార్ వివరించారు. 

నిర్మాణం పూర్తికాకుండానే గతేడాది రాజమండ్రిలో మెడికల్ కాలేజీ ప్రారంభించారని, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతి గదులు లేని పరిస్థితి నెలకొందని చెప్పారు. జగన్ సారూ... విద్యార్థులను ఎక్కడ చదివించాలి... చెట్ల కింద చదివించాలా? అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.  

పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా ఇంకా పూర్తి కాలేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. పులివెందుల కాలేజీలో 48 శాతం బోధనా సిబ్బంది లేరన్న విషయం జగన్ కు తెలియదా? అని ప్రశ్నించారు. 

తరగది గదులు లేవంటే ఎలాగోలా సర్దుకుపోతాం... మరి బోధనా సిబ్బంది లేకపోతే పాఠాలు ఎవరు చెబుతారు? అని నిలదీశారు. పాఠాలు కూడా మీరే చెబుతారా ప్రొఫెసర్ జగన్? అంటూ ఎద్దేవా చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకోవాలనుకున్నారు? అని మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అబద్ధాలు ప్రచారం చేస్తున్నారనే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు... అయినా బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా? అని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకుని జగన్ ఇప్పటికైనా మారాలి అని హితవు పలికారు.
Satya Kumar
Jagan
Medical Colleges
BJP
YSRCP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News