Odisha: చనిపోయిన అధికారికి డ్యూటీ వేసిన ఒడిశా సర్కారు

Dead Odisha Officer Gets Crowd Control Duty For PM Modis Visit
  • ప్రధాని పర్యటన సందర్భంగా జనాలను నియంత్రించే విధులు కేటాయింపు
  • ట్విట్టర్ లో వైరల్ గా మారిన అధికారిక లేఖ
  • విషయం తెలియడంతో హడావుడిగా దిద్దుబాటు
ఒడిశాలో ఆయనో ఉన్నతాధికారి... అనారోగ్యంతో గతేడాది కన్నుమూశారు. తాజాగా ఆయనకు ప్రభుత్వం ఓ పని అప్పగించింది. ప్రధాని పర్యటన సందర్భంగా జనాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన అధికారుల బృందంలో ఆయన పేరును చేర్చింది. ఈమేరకు ఒడిశా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీ ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ గా మారింది. 

దీనిపై ఒడిశా ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. పాపం చనిపోయినా కూడా సదరు అధికారిని ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వదలడంలేదని బిజూ జనతాదళ్ సోషల్ మీడియా హెడ్ స్వయం ప్రకాశ్ మోహాపాత్ర వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

అసలేం జరిగిందంటే...

ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో క్రౌడ్ మేనేజింగ్ కోసం ఒడిశా సర్కారు ఉన్నతాధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. 50 మంది అధికారులకు ఒడిశా కంప్యూటర్ అప్లికేషన్ సెంటర్ (ఓసీఏసీ) లో డ్యూటీ వేసింది. ఇందులో ప్రబోధ కుమార్ రౌత్ అనే ఓఏఎస్ అధికారి పేరు ఉండడం విమర్శలకు దారి తీసింది. సదరు ప్రబోధ కుమార్ రౌత్ గతేడాది అనారోగ్యంతో చనిపోవడమే దీనికి కారణం.

ఓ చనిపోయిన అధికారికి డ్యూటీ వేయడమేంటని ప్రతిపక్ష బిజూ జనతాదళ్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ లో అధికారులు చనిపోయినా కూడా డ్యూటీ చేయాల్సిందే అంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుండడంతో మేలుకున్న ఒడిశా సర్కారు వెంటనే తప్పుదిద్దుకుంది. ప్రబోధ కుమార్ స్థానంలో సుబ్రత్ కుమార్ జెనా అనే అధికారి పేరును చేర్చుతూ తాజాగా మరో ఆర్డర్ కాపీ విడుదల చేసింది.
Odisha
PM Modi
Dead officer
Modi tour

More Telugu News