Nathan Bracken: సెహ్వాగ్‌ను సైతం భయపెట్టిన ఆ మాజీ బౌలర్ ఇప్పుడు అకౌంట్ మేనేజర్... ఎవరో తెలుసా...?

former Australian pacer Nathan Bracken is now working as an account manager in New South Wales
  • మాజీ క్రికెటర్లకు భిన్నంగా కొత్త కెరీర్‌ను కొనసాగిస్తున్న ఆసీస్ మాజీ బౌలర్ నాథన్ బ్రాకెన్
  • 2011లో అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు 
  • తన కాలి గాయానికి కారణమయ్యారంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై దావా 
రిటైర్మెంట్ తర్వాత కొందరు క్రికెటర్లు కామెంటరీని వృత్తిగా ఎంచుకుంటారు. మరికొందరు టీవీలలో మ్యాచ్ విశ్లేషకులుగా ఆదాయాన్ని పొందుతుంటారు. మరికొందరు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విభిన్న అంశాలపై వ్యాఖ్యానాలు చేస్తుంటారు. మరికొందరు కోచింగ్ సిబ్బందిగా కూడా ఉపాధిని పొందుతుంటారు. 

అయితే ఒకప్పుడు వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టాప్ బౌలర్‌గా రాణించి.. వీరేంద్ర సెహ్వాగ్ వంటి బ్యాటింగ్ దిగ్గజాన్ని సైతం భయపెట్టిన ఆసీస్ మాజీ స్టార్ బౌలర్ నాథన్ బ్రాకెన్ వ్యవహారం మాత్రం మిగతా మాజీలకు విభిన్నంగా ఉంది. 

2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు ప్రస్తుతం అకౌంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఎవరూ ఊహించని రీతిలో ఆశ్చర్యకరమైన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో ఉన్న కియార్‌లో అకౌంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

నాథన్ బ్రాకెన్ 2008లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం 47 ఏళ్ల వయసున్న అతడు రాజకీయాల్లోనూ ప్రవేశించాడు. 2023లో జరిగిన ‘ది ఎంట్రన్స్ ఎలక్టోరేట్’లో లిబరల్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు. 

బ్రాకెన్ ఐపీఎల్‌లో ఆడటానికి నిరాకరించాడు. 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ.1.3 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికడంతో ఐపీఎల్‌లో కూడా ఆడబోనని ప్రకటించాడు. కాగా 2018లో ఓ ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. నాథన్ బ్రాకెన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తన మాజీ సహచరుడు వీరేంద్ర సెహ్వాగ్ ఇష్టపడేవాడు కాదని వెల్లడించాడు.

రిటైర్మెంట్ తర్వాత బ్రాకెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా తన కెరీర్‌ను ముగించిందని ఆరోపించాడు. 2007లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌కు ముందు రోజు తన కుడి మోకాలి గాయాన్ని పరీక్షించి చికిత్స అందించడంలో విఫలమయ్యారంటూ క్రికెట్ ఆస్ట్రేలియా పాలకమండలి, ముగ్గురు వైద్యులపై దావా వేశాడు. అయితే ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఎంత పరిహారం చెల్లించాలని కోరుకుంటున్నారని బ్రాకెన్‌ను కోర్టు అడిగిందని ఓ పత్రిక పేర్కొంది. గాయానికి సంబంధించిన మరిన్ని వివరాలను అందించాలని కోరినట్టు వివరించింది.
Nathan Bracken
Cricket
Australia
Viral News

More Telugu News