Liquor: పోలీసులు మద్యం బాటిళ్లు ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే.. ఎత్తుకెళ్లిన మందుబాబులు.. వీడియో ఇదిగో!

Andhra cops line up liquor bottles for disposal locals grab and run off
  • గుంటూరులోని ఏటుకూరు డంపింగ్ యార్డ్ వద్ద ఘటన
  • పేర్చిన మద్యం బాటిళ్ల కోసం ఎగబడిన మందుబాబులు
  • పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం
  మద్యం బాటిళ్లను వాహనంతో తొక్కించే ప్రయత్నం చేస్తున్న పోలీసులకు మందుబాబులు షాకిచ్చారు. పోలీసులను తోసేసి మరీ బాటిళ్లు ఎత్తుకుపోయారు. వారు ఆపుతున్నప్పటికీ లెక్కచేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంటూరులో జరిగిందీ ఘటన.

వివిధ కేసుల్లో పోలీసులు దాదాపు రూ. 50 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని ధ్వంసం చేయాలని నిర్ణయించారు. గుంటూరు నగరం ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డుకు వాటిని తరలించారు. అనంతరం అక్కడ వాటిని ఒక వరుస క్రమంలో పేర్చగా అప్పుడే ఊహించని ఘటన జరిగింది. 

ఆ బాటిళ్లను చేజిక్కించుకునేందుకు మద్యం ప్రియులు పోటీపడ్డారు. ఒక్కసారిగా బాటిళ్ల కోసం ఎగబడడంతో గందరగోళం నెలకొంది. కొందరు మందుబాబులు దొరికిన వాటిని దొరికినట్టు ఎత్తుకెళ్లారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కొందరు బాటిళ్లు చేజిక్కించుకుని వెళ్లిపోయారు. అప్రమత్తమైన పోలీసులు కొందరి నుంచి బాటిళ్లు తిరిగి లాక్కోగా, కొందరు మాత్రం అప్పటికే పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Liquor
Guntur
Liquor Bottles
Andhra Pradesh
Viral Videos

More Telugu News