Rishabh Pant: దులీప్ ట్రోఫీలో రిషభ్‌పంత్‌ వీరబాదుడు.. టీమిండియా కెప్టెన్సీ ఖాయమేనా?

India B Star Rishabh Pant Tactical Brilliance In Duleep Trophy Triggers Captaincy Talks
  • దులీప్ ట్రోఫీలో ఇండియా-బీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్
  • ఇండియా ఏ జట్టుపై రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లో 61 పరుగులు చేసిన ఇండియా స్టార్
  • ప్రశంసలు కురిపించిన టీమిండియా మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్
దులీప్ ట్రోఫీలో ఇండియా-బీ జట్టుకు ఆడుతున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్‌పంత్‌కు టీమిండియా కెప్టెన్సీపై మరోమారు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇండియా-ఏ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులు మాత్రమే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 34 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి జట్టుకు ఆధిక్యాన్ని అందించిపెట్టాడు. సుదీర్ఘ కాలం తర్వాత బంగ్లాదేశ్‌తో త్వరలోనే స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ ఆడనున్న పంత్‌పైనే అందరి దృష్టి ఉంది. కాగా, దులీప్ ట్రోఫీ రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు.

ఇండియా-బీ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయినప్పటికీ మైదానంలో బౌలర్లతో ఎక్కువగా పంతే మాట్లాడుతున్నాడు. బంతిని ఎలా సంధించాలి? ఎక్కడ సంధించాలి అన్న విషయాలు చెబుతూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. పంత్‌తో మాట్లాడిన తర్వాత పేసర్ నవదీప్ సైనీ.. ధ్రువ్ జురెల్ వికెట్ నేలకూల్చాడు. 

ఈ మ్యాచ్‌కు కామెంట్రీ చెప్పిన టీమిండియా మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్.. పంత్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. అతడి వ్యూహాలు అద్భుతమని కొనియాడాడు. కెప్టెన్ ఎవరైనా.. మైదానంలో మాత్రం రిషభ్ పంతే లీడరని చెప్పుకొచ్చాడు. మైదానంలో సైనీకి పంత్ ఇచ్చిన సలహా స్టంప్స్ మైక్‌లో రికార్డయిందని, అది తాను విన్నానని చెప్పుకొచ్చాడు. రామన్ వ్యాఖ్యలతో టీమిండియా తదుపరి కెప్టెన్సీకి అతడు అర్హుడేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా రామన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.
Rishabh Pant
Team India
Duleep Trophy
WV Raman

More Telugu News