Car Parking: ఢిల్లీ విమానాశ్రయంలో కారు పార్కింగ్.. బిల్లు చూసి కళ్లు తేలేసిన యజమాని

Parking at Delhi Airport Cost This Man More Than a Round Trip to Lucknow
  • ఆగస్టు 17న పార్క్ చేసి 26న తిరిగి కారును తీసుకున్న ఢిల్లీ వాసి
  • రూ. 5,770 బిల్లు చేతిలో పెట్టిన పార్కింగ్ సిబ్బంది
  • ఆ సొమ్ముతో ఢిల్లీ నుంచి లక్నోకు విమానంలో వెళ్లి రావొచ్చన్న దీపక్
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కారు పార్క్ చేసిన వ్యక్తి బిల్లు చూసి మూర్ఛపోయాడు. ఢిల్లీకి చెందిన దీపక్ గోసాయ్ ఆగస్టు 17న ఎయిర్ పోర్టులో టెర్మినల్‌లోని మల్టీ లెవల్ ఫెసిలిటీ (ఎంఎల్‌సీపీ)లో తన కారును పార్కింగ్ చేశాడు. 26న తిరిగి తన కారును తీసుకున్నాడు. ఈ క్రమంలో అతడికి రూ. 5,770 పార్కింగ్ బిల్లు ఇచ్చారు సిబ్బంది. ఇందులో రూ. 4,889.83 పార్కింగ్ ఫీజు కాగా, రూ. 880.17 జీఎస్టీ. ఆ బిల్లు చూశాక దీపక్ కు కాసేపు కళ్లు బైర్లు కమ్మాయి. నోట మాట రాలేదు. 

బిల్లు సంగతి పక్కనపెడితే పార్కింగ్‌లో పెట్టిన తన కారు డ్యామేజ్ అయినట్టు దీపక్ గుర్తించాడు. గేట్ లాక్ విరిగిపోయి ఉంది. కారు నిండా గీతలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదు చేయాలని భావించినా పార్కింగ్ సిబ్బంది పట్టించుకోలేదని, డబ్బులు మాత్రం తీసుకున్నారని దీపక్ వాపోయాడు.

దీంతో దీపక్ తన బాధను ‘ఎక్స్’లో పంచుకున్నాడు. తాను చెల్లించిన బిల్లుతో విమానంలో ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లి రావొచ్చని పేర్కొన్నాడు.  ఢిల్లీ-లక్నో ఎయిర్ ఇండియా విమాన టికెట్ రూ. 5,672 మాత్రమే. కానీ, పార్కింగ్ ఫీజు రూ. 5,770 అయిందని దీపక్ వాపోయాడు. టెర్మినల్ 3లో కారు పార్కింగ్ ఫీజు తొలి 30 నిమిషాలకు రూ. 120 వసూలు చేస్తారు. ఆ తర్వాత అరగంటకు రూ. 170, ఆ తర్వాత గంట నుంచి ఐదు గంటల వరకు గంటకు రూ. 100 చొప్పున వసూలు చేస్తారు. ఐదు గంటల కంటే ఎక్కువ సమయం పార్క్ చేస్తే 24 గంటలకు రూ. 600 చొప్పున వసూలు చేస్తారు.
Car Parking
Delhi Airport
Parking Fee

More Telugu News