Chandrababu: ప్రకాశం బ్యారేజి గేట్లను ధ్వంసం చేసేందుకే ఆ పడవలు వదిలారా?: సీఎం చంద్రబాబు

CM Chandrababu talks about boats hitting Prakasam Barrage gates
  • విజయవాడలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం
  • ప్రకాశం బ్యారేజి గేట్లను ఢీకొట్టిన పడవలు
  • ఆ పడవలపై అనుమానాలు ఉన్నాయన్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజి గేట్లను కొన్ని పడవలు ఢీకొట్టడంపై స్పందించారు. 

ప్రకాశం బ్యారేజి గేట్లను ధ్వంసం చేసే ప్రణాళికలో భాగంగానే ఆ నాటు పడవలను వదిలారా? లేక, ఆ పడవలు ప్రమాదవశాత్తు వరద ప్రవాహానికి కొట్టుకువచ్చాయా? అనే అంశంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. 

ఇక, వరద సహాయ కార్యక్రమాల్లో సరిగా పనిచేయని అధికారులు, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటున్న వారు మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. 

ప్రస్తుత క్లిష్ట సమయంలో అధికారులు, అనధికారులు ప్రజాహితమే లక్ష్యంగా పనిచేయాలని, కష్టంలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సురక్షిత ప్రాంతంలో ఉన్న వారు కనీసం ఒక్క కుటుంబానికైనా సాయం చేయాలని సూచించారు. 

ఐవీఆర్ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దయచేసి నిస్సహాయ స్థితిలో ఉన్న వారు మాత్రమే సాయం కోరాలని, తప్పుడు సమాచారం వల్ల సహాయ బృందాల సమయం వృథా అవుతుందని పేర్కొన్నారు.
Chandrababu
Boats
Prakasam Barrage
Vijayawada Floods
TDP-JanaSena-BJP Alliance

More Telugu News