Pune: కన్నుమూసి తెరిచేలోగా రూ.5 లక్షల విలువైన నగలు కొట్టేసిన దొంగ.. వీడియో ఇదిగో!

 Pune Couple Stops To Eat Vada Pav Thief Steals Jewellery Worth 5 Lakhs
  • పూణేలో ద్విచక్రవాహనం పై నుంచి నగలు ఎత్తుకెళ్లిన యువకుడు
  • వడాపావ్ తినడానికి ఆగిన భార్యాభర్తలు
  • స్కూటీ దగ్గరే ఉన్న భార్య దృష్టి మళ్లించిన బైకర్
మహారాష్ట్రలోని పూణేలో ఓ దొంగ రూ.5 లక్షల విలువైన నగలను క్షణాల్లో కొట్టేసి పారిపోయాడు. స్కూటీ పక్కనే నిల్చున్న మహిళను బైక్ పై వచ్చిన యువకుడు దృష్టి మళ్లించగా.. పక్కన నిల్చున్న యువకుడు స్కూటీ ముందు పెట్టిన బ్యాగు తీసుకుని పరుగందుకున్నాడు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ చోరీ ఘటన రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్కూటీపై వచ్చిన భార్యాభర్తలు రోడ్డు పక్కగా ఆగడం, భర్త పక్కకు వెళ్లగా భార్య అక్కడే నిలుచుని ఉండడం వీడియోలో కనిపిస్తోంది. ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నారో తెలియదు కానీ ఓ యువకుడు అక్కడే తచ్చాడుతున్నాడు. ఇంతలో బైక్ పై వచ్చిన మరో యువకుడు ఏదో చెప్పడంతో ఆ మహిళ స్కూటీ వెనకకు వచ్చి టైరును గమనించింది. ఇంతలో స్కూటీ పక్కనే ఉన్న యువకుడు బ్యాగు తీసుకుని ఉడాయించాడు. క్షణాలలో జరిగిపోయిన ఈ ఘటన నుంచి ఆ మహిళ తేరుకుని దొంగ వెంటపడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బైక్ పై వచ్చిన యువకుడు, రోడ్డు పక్కన నిలుచున్న యువకుడు ఇద్దరూ తోడుదొంగలని స్థానికులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Pune
Thief
Biker
Scooty
Gold ornaments
Viral Videos

More Telugu News