Aadhaar: ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం

last date to update Aadhaar details for free will end on September 14
  • సెప్టెంబర్ 14తో ముగిసిపోనున్న ఉచిత అప్‌డేట్ గడువు
  • మరోసారి పొడిగింపుపై ఇప్పటివరకు లేని స్పష్టత
  • ఇప్పటికే పలుమార్లు పొడిగించిన యూఐడీఏఐ
ప్రభుత్వ సేవలు పొందేందుకు, గుర్తింపు నిర్ధారణకు అత్యంత ప్రామాణికమైన ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ ప్రస్తుతం ఉచితంగా సౌలభ్యం కల్పిస్తోంది. ఈ ఉచిత సర్వీస్ సెప్టెంబర్ 14తో ముగుస్తుంది. ఇప్పటికే యూఐడీఏఐ పలుమార్లు ఈ గడువును పొడిగించింది. దీంతో మరోసారి పెంచుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాబట్టి ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు డెడ్‌లైన్ లోగా త్వరపడడం మంచిది.

కాగా ఆధార్‌ ఉచిత అప్‌డేట్ గడువును యూఐడీఏఐ అనేకసార్లు పొడిగించింది. మరోసారి పొడగింపుపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న గడువును జూన్ 14న మూడు నెలలపాటు పెంచింది. అంతకుముందు గతేడాది డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది మార్చి 14 వరకు పొడిగించింది.

కాగా ఆధార్ కార్డ్ వినియోగదారులు గుర్తింపు ఆధారాలు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. గత పదేళ్లలో ఆధార్‌లో చిరునామాను అప్‌డేట్ చేసుకోకుంటే ఎలాంటి ఛార్జీలు లేకుండానే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్‌తో అనుసంధానమైన రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి. దానికి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆధార్‌లో పేరు, మొబైల్ నంబర్, ఫోటో వంటి ఇతర వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటే యూఐడీఏఐ అధికారిక కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది.

కాగా యూఐడీఏఐ మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులు ప్రతి 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. తద్వారా చిరునామా, ఇతర వివరాలు అప్‌డేట్ అవుతుంటాయని, ప్రభుత్వ పథకాలను పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవని యూఐడీఏఐ చెబుతోంది.
Aadhaar
Aadhaar Update
UIDAI
Aadhar News

More Telugu News