Sensex: సరికొత్త గరిష్ఠాలను తాకిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Sensex and Nifty rally to new peaks as Moody revises India growth forecast
  • భారత వృద్ధి రేటు అంచనాలు పెరగడంతో మార్కెట్లలో లాభాల జోష్
  • సానుకూలంగా మారిన గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్
  • అమెరికా జీడీపీ డేటా పాజిటివ్‌గా ఉండడంతో లాభాల బాటలో పయనిస్తున్న అంతర్జాతీయ మార్కెట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతానికి పెంచుతూ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సవరించడం... మరోవైపు అమెరికా జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండడంతో లాభాల బాటలో పయనిస్తున్న గ్లోబల్ మార్కెట్లను అనుసరిస్తూ.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ (శుక్రవారం) పైపైకి పరుగులు పెడుతున్నాయి. ఆగస్టు నెలలో చివరి ట్రేడింగ్ రోజు అయిన నేడు మార్కెట్లు చక్కటి లాభాలతో ఆరంభమయ్యాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ 0.61 శాతం లేదా 502 పాయింట్లు పెరిగి 82,637.03 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ సూచీకి ఇది జీవితకాల గరిష్ఠంగా ఉంది. ఇక ఎస్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 97.75 పాయింట్లు లేదా 0.39 శాతం వృద్ధి చెంది 25,249.70 వద్ద ఆరంభమైంది. 25,257 వద్ద నిఫ్టీ జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకింది.

అమెరికా జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండడంతో గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయని మార్కెట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికా గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయని విశ్లేషించారు. ఇండియన్ మార్కెట్లు రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయిని తాకేందుకు పరుగులు తీస్తున్నాయని బ్యాంకింగ్, మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా అభిప్రాయపడ్డారు. ఇవాళ సాయంత్రం భారత జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయని, వీటి ఆధారంగా అక్టోబర్‌లో జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా? లేదా? అనే అంచనాలు రావొచ్చని అభిప్రాయపడ్డారు. కాగా మార్కెట్లు ప్రస్తుతం సవ్యమైన దిశలోనే పయనిస్తున్నాయని అజయ్ బుగ్గా పేర్కొన్నారు. కాగా ఆసియాలో దాదాపు అన్ని మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. జపాన్ నిక్కీ సూచీ 0.5 శాతం, హాంగ్ కాంగ్ హ్యాంగ్ సెంగ్ సూచీ 1.35 శాతం, ఇండోనేషియా జకార్తా కాంపోజిట్ సూచీ 0.38 శాతం, దక్షిణ కొరియా కోప్సీ సూచీ 0.42 శాతం మేర లాభపడ్డాయి.
Sensex
Nifty
India
USA
Stock Market

More Telugu News