Israel: మూడు రోజుల విరామానికి అంగీకరించిన ఇజ్రాయెల్ ఆర్మీ, హమాస్

Israel and Hamas have agreed to pauses in fighting in Gaza to allow vaccination campaign
  • పోలియో టీకా కార్యక్రమం కోసం గాజాలో 3 రోజులపాటు కాల్పుల విరమణ
  • అంగీకారం కుదిరిందని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • మొదటి రౌండ్‌లో 6,40,000 మంది పిల్లలకు పోలియో టీకాలు వేయాలని నిర్ణయం
ఇజ్రాయెల్ మిలిటరీ, పాలస్తీన్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ మూడు రోజులపాటు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. ఈ ప్రాంతంలోని పిల్లలకు పోలియో టీకాలు అందించేందుకు సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరడంతో అంగీకరించాయి. గాజాలోని మూడు వేర్వేరు జోన్లలో 3 రోజుల పాటు కాల్పులకు దూరంగా ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ అధికారి ఒకరు గురువారం ప్రకటించారు. కాగా మొదటి రౌండ్‌లో 6,40,000 మంది పిల్లలకు పోలియో టీకాలు వేయనున్నారు. 

కాగా టీకాల పంపిణీ కార్యక్రమం ఆదివారం ప్రారంభం కానుంది. గాజా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలియో టీకా కార్యక్రమం జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ అధికారి రిక్ పీపర్‌కార్న్ వెల్లడించారు. తొలుత మధ్య గాజాలో, ఆ తర్వాత దక్షిణ గాజాలో, మూడు రోజుల విరామం అనంతరం ఉత్తర గాజా టీకా కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. అవసరమైతే నాలుగవ రోజు కూడా ఒప్పందాన్ని పొడిగించాల్సి ఉంటుందని పీపర్‌కార్న్ పేర్కొన్నారు.

గత అనుభవాలను బట్టి చూస్తే టీకా కార్యక్రమాన్ని సంపూర్ణంగా ముగించడానికి అదనపు రోజులు అవసరమవుతాయని, అదనపు రోజులు పట్టడం తరచుగా చూస్తుంటామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైక్ ర్యాన్ వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గాజాలో మానవతా పరిస్థితిపై సమీక్షా సమావేశంలో ఈ విషయాలను తెలిపారు.

కాగా గాజాలో ఇటీవలే టైప్ 2 పోలియో వైరస్ కేసు నమోదయింది. ఒక పాప పక్షవాతానికి గురైందని ఆగస్టు 23న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. 25 ఏళ్లలో గాజాలో పోలియో కేసు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Israel
Hamas
Palestine
WHO

More Telugu News