Bangladesh: బంగ్లాదేశ్ అల్ల‌ర్ల‌లో 1000 దాటిన మ‌ర‌ణాల సంఖ్య!

Over 1000 dead and hundreds blinded in Bangladesh protests against Sheikh Hasina says Interim government
  • షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవ‌ల బంగ్లాదేశ్‌లో నిర‌స‌న‌లు 
  • ఆ త‌ర్వాత ఈ నిరసనలు హింసాత్మక ఘర్షణకు దారితీయ‌డంతో భారీ ప్రాణ‌న‌ష్టం
  • ఇప్ప‌టివ‌రకు ఈ అల్ల‌ర్లలో 1000 మందికి పైగా చ‌నిపోయిన‌ట్లు వెల్ల‌డించిన బంగ్లా తాత్కాలిక ప్ర‌భుత్వం
షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవ‌ల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌లో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ దేశంలోని ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వెల్ల‌డించింది.

ఢాకాలోని రాజర్‌బాగ్‌లో ఉన్న‌ సెంట్రల్ పోలీస్ ఆసుపత్రిని సందర్శించిన ఆరోగ్య సలహాదారు నూర్జహాన్ బేగం ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

అలాగే నిర‌స‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టే క్ర‌మంలో పోలీసుల చర్య కారణంగా 400 మందికి పైగా విద్యార్థులు, సామాన్య‌ ప్రజలు తమ కంటిచూపును కోల్పోయారని తెలిపారు. కొందరికి ఒక కన్ను, మరికొందరికి రెండు కళ్లలో చూపు పోయిందని ఆమె వెల్లడించారు. ప్ర‌స్తుతం కొంత‌మంది పోలీస్ అధికారులు కూడా త‌ల‌ల‌కు, కాళ్ల‌కు గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు నూర్జహాన్ బేగం తెలిపారు. 

ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తాత్కాలిక ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని, క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందజేస్తామని స‌ర్కార్‌ హామీ ఇచ్చింద‌ని ఆమె పేర్కొన్నారు. కాగా, ప్ర‌భుత్వ స‌ర్వీసుల‌లో వివాదాస్పద రిజ‌ర్వేష‌న్‌ కోటాకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఆ త‌ర్వాత‌ హింసాత్మక ఘర్షణల‌కు దారితీశాయి. దీంతో భారీ మొత్తంలో ప్రాణ‌న‌ష్టం జ‌రిగింది. 

చివ‌రికి ఆ దేశ‌ ప్రధాన మంత్రి షేక్ హసీనా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు దారితీసింది. ప్ర‌స్తుతం ఆమె ఇండియాలో త‌ల‌దాచుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇక బంగ్లా అల్ల‌ర్ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే హ‌సీనాపై అక్క‌డి తాత్కాలిక స‌ర్కార్ ప‌దుల సంఖ్య‌లో కేసులు న‌మోదు చేసింది.
Bangladesh
Sheikh Hasina
Protest

More Telugu News